ప్రస్తుత కాలంలో ర్యాంకులే పరమావధిగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల సృజనాత్మకతను బయటకు తీయడానికి మాత్రం అలసత్వం వహిస్తున్నారు. ఎందుకంటే వాటితో ప్రైవేటు యాజమాన్యాలకు ఎలాంటి లాభం ఉండదు కాబట్టి. ప్రభుత్వ పాఠశాలలో కొంత మెరుగ్గా ఉన్నా.. ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి రెండు ప్రాజెక్టులు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు ఎన్నిసార్లు వారికి తెలియజేసినా ముందుకు రాకపోవడం గమనార్హం.
కందనూలు: చిన్నారుల ఆలోచనలకు సరికొత్త రూపం ఇవ్వడానికి.. నూతన ఆవిష్కరణల్లో వారిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా ఇన్‌స్పైర్ మనక్ నిర్వహిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాఠ్య పుస్తకాల పరిజ్ఞానమే కాకుండా.. సృజనాత్మక ఆలోచనలు, సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం విద్యార్థులకు ఎంతో అవసరం. ఇలాంటి సృజనాత్మకతతో కూడిన భావాలను వెలికితీసి.. జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇన్‌స్పైర్ మనక్‌కు స్పందన కరువైంది. జూలై 1న ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభమై రెండు నెలలు గడుస్తుండగా.. జిల్లాలో వెయ్యి దరఖాస్తులకు గాను 450 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. నగదు ప్రోత్సాహం కల్పించినా నామినేషన్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఈ నెల 15 నాటికి గడువు ముగియనుండటంతో ఏ మేరకు దరఖాస్తులు పెరుగుతాయో వేచిచూడాలి.
రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం..
నామినేషన్ ఇన్‌స్పైర్‌లో ప్రతిభ కనపరిచిన విద్యార్థికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం ఇస్తారు. విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమచేస్తారు. తొలుత జిల్లాస్థాయిలో ఆ తర్వాత ఎంపికై తే వారికి రాష్ట్రస్థాయిలో అందులో ఎంపికై తే జాతీయ స్థాయి వరకు విద్యార్థులు తమలోని వైజ్ఞానిక ప్రతిభను ప్రదర్శించే వీలు కలుగుతుంది. విద్యార్థులను ప్రోత్సహించి ఇన్‌స్పైర్‌కు నామి నేషన్లు నమోదు చేయించడంలో సంబంధిత పాఠ శాలల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా సైన్స్ అధికారు లు కూడా సంబంధిత ఉపాధ్యాయులకు అవ గాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ప్రతి పాఠశాల నుంచి 5..
జిల్లావ్యాప్తంగా 124 ప్రాథమికోన్నత, 130 ఉన్నత, ప్రైవేటులో 83 ప్రాథమికోన్నత, 80 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అయితే అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. వన్‌టైం రిజిస్ట్రేషన్‌లో భాగంగా విద్యాలయాలు వివరాలు పొందుపర్చాలి.
చర్యలు తీసుకుంటున్నాం..
జిల్లా నుంచి అధిక మొత్తంలో దరఖాస్తులు పంపేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని పాఠశాలల ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం. ఎంఈఓలు, పాఠశాలల హెచ్‌ఎంల సహకారంతో వీలైనంత ఎక్కువ దరఖాస్తులు చేయించేలా ప్రయత్నిస్తున్నాం.
– శైలజ, జిల్లా సైన్స్ అధికారి


