నాగర్‌కర్నూల్: రాజీమార్గమే రాజమార్గం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాకేంద్రంలోని జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో లోక్ అదాలత్ నిర్వహించామన్నారు. ఈ లోక్ అదాలత్‌లో భూ తగాదా, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్‌బౌన్స్, కుటుంబ కేసులు, మోటారు వాహనాల ఆక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు తదితర పెండింగ్ కేసులకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 6,985 కేసులు పరిష్కారం అయ్యాయని చెప్పారు. రాజీ మార్గమే రాజమార్గం ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్ లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన క్రాప్‌లోన్ ప్రీ లిటిగేషన్ కేసు రూ.3 లక్షలు ఉన్నటువంటి కేసును రూ.90 వేలకు రాజీ ద్వారా పరిష్కరించబడిందన్నారు. కార్యక్రమంలో జిల్లా పోక్సో స్పెషల్ జడ్జి నసీమా సుల్తానా, లీగల్ సర్వీసెస్ సెక్రెటరీ నిహారిక, గోపిక నాగశ్రావ్య, శృతిదూత, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్‌రావు, కక్షిదారులు పాల్గొన్నారు.


