కందనూలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు ఈ నెల 7 చివరి తేదీ అని ప్రిన్సిపల్ మదన్‌మోహన్, అంబేడ్కర్ సార్వత్రిక అధ్యయన కేంద్రం సమన్వయకర్త అంజయ్య తెలిపారు. శనివారం కళాశాల ఆవరణలో ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాలను అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులతోపాటు ఐటీఐ లేదా ఏదైనా రెండేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసిన వారు కూడా వెంటనే డిగ్రీలో ప్రవేశం పొందవచ్చన్నారు. ఓపెన్ డిగ్రీ విద్యకు రెగ్యులర్ డిగ్రీతో సమాన గుర్తింపు, అవకాశాలు ఉన్నాయని, ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా చదువును మధ్యలో ఆపేసిన వారు, గృహిణులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించాలని, లేకపోతే ప్రస్తుత విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అడ్మిషన్ కోసం నేరుగా కళాశాలలో సంప్రదించాలని, ఆదివారం సైతం కళాశాల తెరిచి ఉంటుందని చెప్పారు.
బిడ్డకు తల్లిపాలేసంపూర్ణ ఆహారం
కందనూలు: బిడ్డకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం అని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణి ప్రసవించిన తర్వాత పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు పట్టించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తేనె, చక్కెర, గ్లూకోస్ నీరు వంటివి ఇవ్వరాదని చెప్పారు. మొదటి మూడు రోజుల తల్లిపాలు బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి దోహదపడుతుందన్నారు. బిడ్డ పుట్టిన 48 గంటల తర్వాత కొంతమంది పిల్లల్లో వచ్చే ఫిజిలాజికల్ జాండ్రీస్ తీవ్రత తగ్గుతుందన్నారు. బిడ్డకు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకు భవిష్యత్‌లో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం బారిన పడకుండా నివారించగలుగుతామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ రవిశంకర్, ప్రోగ్రాం అధికారి సురేష్‌బాబు, రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భరత్‌కుమార్‌రెడ్డి, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగిరం చేయాలి
లింగాల: మండలానికి మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ పీడీ గోపాల్‌నాయక్ ఆదేశించారు. శనివారం మండలంలోని అప్పాయపల్లి, చెన్నంపల్లి, పద్మన్నపల్లి గ్రామాలను సందర్శించిన పీడీ, ఇతర అధికారులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పంచాయతీల వారీగా ఇళ్ల నిర్మాణాల ప్రగతిని తెలుసుకొని.. వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. మండలానికి 485 ఇళ్లు మంజూరవగా.. ఇప్పటి వరకు 79 ఇళ్లు మాత్రమే పూర్తవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో రెండో దశ ఇళ్లు మంజూరవుతాయని, ఆలోగా మొదటి దశ ఇళ్లను పూర్తి చేయించాలని ఎంపీడీఓ, కార్యదదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డీఈ హరిలాల్‌నాయక్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ రాముడునాయక్, ఏఈ నర్సింహ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


