కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ మండలంలోని బొందలపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేసి.. మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు వారి ఆరోగ్యం, పోషకాహారం, భద్రతపై కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందికి స్పష్టం చేశారు. పాఠ్యాంశాలపై వారి అవగాహన, చదివే సామర్థ్యం, రాత నైపుణ్యం, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విధానాన్ని పరిశీలించి విద్యా ప్రమాణాలను అంచనా వేశారు. ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని గుర్తించి, వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులలో నేర్చుకునే ఆసక్తిని పెంపొందించేలా బోధన కొనసాగించాలని చెప్పారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది అనాథలు, వలస కార్మికుల పిల్లలు, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన వారేనని.. అలాంటి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.


