దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

Aug 2 2026 1:52 AM | Updated on Aug 2 2026 1:52 AM

నాగర్‌కర్నూల్‌: దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా చేరేలా సదరం యూనిక్‌ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ (సెర్ప్‌) సీఈఓ దివ్య దేవరాజన్‌ అన్నారు. శనివారం ఆమె హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్‌డీఓ అధికారులతో వీసీ నిర్వహించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆధునిక సౌకర్యాలతో సదరం యూడీఐడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వ్యయం చేస్తోందన్నారు. ప్రతి కేంద్రంలో సేవలను వేగవంతం చేసేందుకు ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తున్నట్లు వెల్లడించారు. గత 75 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 27,839 మంది దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు ఆమోదించామని, ఇంకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను అత్యవసరంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి దివ్యాంగుడికి యూడీఐడీ కార్డులు అందేలా కృషిచేస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ శాఖ, డీఆర్‌డీఓ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి దివ్యాంగులకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. నల్లమల ఏజెన్సీ ప్రాంతాల్లో నివశిస్తున్న చెంచు గిరిజనుల కోసం ప్రత్యేక మొబైల్‌ సదరం శిబిరాల నిర్వహణతోపాటు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం క్యాంపు ఏర్పాట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే శ్రవణ లోపం ఉన్న దివ్యాంగులను శాసీ్త్రయ పద్ధతిలో గుర్తించి వారికి కచ్చితమైన ధ్రువీకరణ అందించేందుకు జిల్లా కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సౌండ్‌ప్రూఫ్‌ గది ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో డీఆర్‌డీఓ ఏపీడీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement