కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు చేరుకున్న వెంటనే విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, తరగతుల నిర్వహణ, బోధన విధానాన్ని పరిశీలించారు. ఈ సమయంలో పాఠశాలలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. ప్రధానోపాధ్యాయుడు శంకర్‌తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానస విధులకు గైర్హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ముగ్గురు ఉపాధ్యాయులు ఒకేసారి విధులకు హాజరుకాకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. విధులకు హాజరైన ఉపాధ్యాయులు సరస్వతి, రజితలను కలెక్టర్ వివిధ అంశాలపై ప్రశ్నించారు. అనంతరం ఫోన్‌లో డీఈ ఓ రమేష్‌కుమార్‌తో మాట్లాడుతూ.. విధులకు గైర్హాజరైన ప్రధానోపాధ్యాయుడు శంకర్‌తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానసను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. పాఠశాలల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు ఎంఈఓ శంకర్‌నాయక్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈఓ వెల్లడించారు.
డ్రై డేను బాధ్యతగా నిర్వర్తించాలి
డ్రై డేను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో కళాశాల విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
గర్భిణులకు 102 సేవలను వినియోగించాలి
గర్భిణులను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో 102 సేవలను వినియోగించాలని ఆశా కార్యకర్తలను కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. అక్కడే ఉన్న గర్భిణులతో కలెక్టర్ మాట్లాడగా.. వారు వైద్య పరీక్షల కోసం బస్సులో ఆస్పత్రికి వచ్చినట్లు తెలపడంతో ఆశా కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 102 అంబులెన్స్ సేవలను ఎందుకు వినియోగించలేదని ఆరా తీశారు.
తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు
పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పట్టణంలోని మిషన్ భగీరథ 60 ఎంఎల్‌డీ తాగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు.


