అవగాహనతోనే ఎయిడ్స్‌ నిర్మూలన | - | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే ఎయిడ్స్‌ నిర్మూలన

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

కందనూలు: ఎయిడ్స్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.కృష్ణ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్లు, వైద్యసిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలతో పాటు చెంచుపెంటల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి.. హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా వలస కార్మికులు, లారీ డ్రైవర్లు, ఇతర కార్మికులకు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు చేసి.. వ్యాధిగ్రస్తులను గుర్తించాలని తెలిపారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డా.రఫీక్‌, డా.రవికుమార్‌, జిల్లా దిశ మేనేజర్‌ రమేశ్‌కుమార్‌, డీడీఎం సాయికుమార్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు.

లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతివ్వాలి

అచ్చంపేట: ఈ నెల 25న తొలి ఏకాదశి సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలోని లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతించాలని భజరంగ్‌దళ్‌ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్‌చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లమల ప్రాంత ప్రజలతో పాటు ఆదివాసీ చెంచుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు లొద్ది మల్లయ్య ఆలయం ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి సందర్భంగా చెంచు పూజారుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నా రు. ఈ ఏడాది కూడా అటవీశాఖ అనుమతులు ఇచ్చి.. భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో భజరంగ్‌దళ్‌ డివిజన్‌ కన్వీనర్‌ సీతారాల శివచంద్ర, చందులాల్‌ చౌహాన్‌, శివాజీ, నరేశ్‌, చందర్‌, అజయ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

తెలకపల్లి/మన్ననూర్‌: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక పద్ధతిన ఆంగ్ల మాధ్యమం బోధనకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్‌ అధికారిణి విద్యులత, జిల్లా సమన్వయ అధికారిణి ఏఆర్‌ లక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు, బాలుర పాఠశాల/కళాశాలల్లో పలు ఖాళీలు ఉన్నాయని.. విద్యార్హతలతో పాటు టెట్‌ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజనల్‌ ధ్రువపత్రాలతో ఈ నెల 17న తెలకపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించే డెమోకు హాజరు కావాలని వారు సూచించారు. పూర్తి వివరాలకు 80191 89182 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

కరువు ప్రాంతంగా

ప్రకటించాలి

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణను కరువుపీడిత ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో వర్షపాతం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వం వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించి.. అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ సభ్యుడు ఆనంద్‌జీ, కేశవులుగౌడ్‌, కృష్ణాజీ, బాలపీర్‌, రామస్వామి, గాలెన్న ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement