సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. మొదట పాలమూరు సమీపంలోని దివిటిపల్లిలో ఉన్న అమరరాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్‌లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను, అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను మహబూబ్‌నగర్, వనపర్తి కలెక్టర్లు ఖుష్బూగుప్తా, ఆదర్శ్ సురభి వేర్వేరుగా వెల్లడించారు. సీఎం పర్యటించనున్న ప్రదేశాలను మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్, భద్రత ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో వేదిక (డయాస్), సీటింగ్, రాకపోకలు, ఇతర మౌలిక సదుపాయాలపై మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులతో సమీక్షించారు.ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్, వైద్య బృందాల ఏర్పాటు, అగ్నిమాపక సిబ్బంది మొహరింపుపై పోలీస్, రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి, అతిథుల స్వాగతం నుంచి వీడ్కోలు వరకు ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, చిన్న లోటు కూడా ఉండకూడదు అని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎస్పీ డి.జానకి, ఆర్‌డీఓ నవీన్, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు. కొత్తకోటలో సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ పాఠశాలను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో పాటు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునితారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్‌కుమార్, సీఎం సెక్యూరిటీ ఇన్‌చార్జ్ శ్రీధర్ తదితరులు పరిశీలించి.. అన్నిఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
పర్యటన షెడ్యూల్ ఇలా..
మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి 1.15 గంటలకు దివిటిపల్లికి చేరుకుంటారు.
1.20 నుంచి 2.20 గంటల వరకు అమరరాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్‌లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవం, ప్లాంట్ పర్యటన, ప్రసంగం ఉంటుంది.
మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.45 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.


