కోడేరు: శాంతిభద్రల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ పనిచేస్తోందని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. శుక్రవారం కోడేరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదులపై వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి కేసులో పారదర్శక విచారణ జరిపి.. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. అదే విధంగా స్థానిక రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్‌ఐ వేణుగోపాల్‌కు సూచించారు. గ్రామస్థాయిలో విధులు నిర్వహించే విలేజ్ పోలీసు ఆఫీసర్లు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారంలో తమవంతు పాత్ర పోషించాలని తెలిపారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, సీఐ శంకర్‌నాయక్ ఉన్నారు.


