కందనూలు: బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విద్యాశాఖ, షీటీం, భరోసా, చైల్డ్ అండ్ వెల్ఫేర్, లేబర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టాలని సురక్షిత బాల్యాన్ని సమాజానికి అందించాలని పేర్కొన్నారు. అనంతరం మిషన్ వాత్సల్య పథకం వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీసీఎస్‌ఐ శంకర్, డీసీఆర్‌బీ ఎస్‌ఐ రమేష్, భరోసా ఎస్‌ఐ రజిత తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పూర్ణిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు htt ps://navodaya.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న ఆయా జిల్లాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు.
విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి
కందనూలు: ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నిర్వహించే వామపక్షాల బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి తారాసింగ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బందు వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికి వదిలేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తుందని, స్వయంగా సీఎం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ప్రారంభోత్సవాలకు వెళ్లడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి శివప్రసాద్, హేమంత్, మధు, శివ తదితరులు పాల్గొన్నారు.
14న అప్రెంటిస్‌షిప్ మేళా
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సు (2024, 2025, 2026 విద్యా సంవత్సరం)లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 14న అప్రెంటిస్‌షిప్ మేళా ఉంటుందని మేళా కో–కన్వీనర్ ఎం.జంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జరిగే ఈ మేళాలో హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రైవేటు కంపెనీలు, ఆస్పత్రులు, సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ పదోతరగతి, ఇంటర్ మెమోలు, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో పాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తీసుకురావాలని, ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పాలమూరు వెంకన్నబ్రహ్మోత్సవాలు ప్రారంభం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం శ్రీకంచికామకోటి పీఠం పాలమూరుశాఖ 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతిపూజ, గోపూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరుణ పూజ, గోపూజ, కంకణధారణ, యాగశాల ప్రవేశం, గరుడ ధ్వజారోహణం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం వేదపారాయణం, పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారికి శేషవాహన సేవ నిర్వహించారు. శివాలయంలో నంది వాహన సేవ, నీరాజనం, మంత్రపుష్సాలు, చతుర్వేద స్వస్తీ పూజలు చేశారు. ప్రతి రోజు వివిధ సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్‌శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ తెలిపారు.


