కొల్లాపూర్: ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్ అన్నారు. మంగళవారం ఆయన కొల్లాపూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి రెవెన్యూ శివారు పరిధిలోని పోడుభూముల సమస్యను మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. సురభి రాజవంశస్థులకు చెందిన భూములపై సీలింగ్ యాక్టును అమలుచేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోడుభూములు సాగుచేస్తున్న గిరిజనులందరికీ పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించిందని.. ఇప్పుడు వాటిని భర్తీచేయకుండా కేవలం 5వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ప్రకటించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సీఎంతో పాటు మంత్రులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, పట్టణ కార్యదర్శి యూసూఫ్, జంగం శివుడు, రామకృష్ణ, రాజు తదితరులు ఉన్నారు.


