కందనూలు: జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు నాణ్యతగా అమలవుతున్నాయా.. లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లావ్యాప్తంగా 28 బీసీ సంక్షేమశాఖ వసతిగృహాల్లో వివిధ శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతి అధికారి తనకు కేటాయించిన వసతిగృహాన్ని పరిశీలించడంతో పాటు విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వసతిగృహాల్లోని పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులు, సిబ్బంది హాజరు తదితర అంశాలపై సమగ్ర నివేదికలను ఆన్‌లైన్ ద్వారా కలెక్టర్‌కు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. సంక్షేమ వసతిగృహాలు పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్‌కు బలమైన పునాది వంటివని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి సౌకర్యం పూర్తిస్థాయిలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని.. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని.. విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, రాత్రి భోజనం, పాలు, గుడ్లు, పండ్లు తదితర పోషకాహార పదార్థాలు నిర్ణీత ప్రమాణాల ప్రకారం అందుతున్నాయా లేదా అనేది ప్రత్యేకంగా పరిశీలించాలని తెలిపారు. అదే విధంగా వసతిగృహాల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్ల పరిశుభ్రత, స్నానాల గదులు, పడకలు, పరుపులు, ఫ్యాన్లు, లైట్లు, వంటశాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్యసేవలు, విద్యార్థుల హాజరు, వార్డెన్లు, ఇతర సిబ్బంది విధి నిర్వహణ వంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తనిఖీల్లో అధికారులు సమర్పించిన నివేదికల్లో గుర్తించిన లోటుపాట్లపై వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత సంక్షేమ వసతిగృహాల వార్డెన్లు, బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారిణి ఇందిరను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దేవసహాయం, అరుణారెడ్డి, డీఆర్వో పాండు తదితరులు ఉన్నారు.


