నేడు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞత సభ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 2006లో ఆయన మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రి హోదాలో వందన సభ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలైన తన రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన మిడ్జిల్, ఊర్కొండ మండలాలకు చెందిన ఆనాటి ఆత్మీయులతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలలో రేవంత్‌రెడ్డి పర్యటన అటు రాజకీయంగా, ఇటు భావోద్వేగ పరంగా ప్రత్యేకతను సంతరించుకుంది.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..
శనివారం ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లాకు బయలుదేరుతారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు ఊర్కొండపేట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోనున్నారు.
ప్రత్యేక పూజల అనంతరం ఆలయ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చేయనున్నారు.
ఆ తర్వాత ఆలయ ఆవరణలో తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన ఆనాటి అనుచరులు, ముఖ్య నేతలు, పెద్దలతో సమావేశమై వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు.
2.30 గంటలకు ఊర్కొండపేట నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు బయలుదేరుతారు.
2.45 గంటలకు వెల్జాల క్రాస్ రోడ్‌కు చేరుకుని దివంగత స్థానిక సీనియర్ నేత గోపాల్‌రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
అక్కడి నుంచి మిడ్జిల్ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
3.15 గంటలకు మిడ్జిల్‌లో జరిగే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.
20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని పర్యటన
ఊర్కొండలోని హనుమాన్ ఆలయంలో పూజలు
ప్రజాప్రతినిధిగా తొలి అడుగు వేసిన నేలలో ఆత్మీయులతో భేటీ
వరాల జల్లు కురిపిస్తారనిప్రజల్లో ఆశలు


