కల్వకుర్తి టౌన్: ఊర్కొండ మండలంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. శుక్రవారం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద పలు శాఖల అధికారులతో కలెక్టర్, ఎస్పీ, ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే హెలీప్యాడ్, ఆలయ ప్రాంగణం, ముఖ్యమంత్రి సభావేదిక, ప్రజల రాకపోకల మార్గాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు, కాన్వాయ్ ప్రయాణ మార్గం, భద్రతా పాయింట్లను స్వయంగా తనిఖీ చేసి అధికారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ తెలిపారు. సీఎం భద్రతా విభాగం తరపున ఏఎస్పీ వాసుదేవరెడ్డి, డీఎస్పీలు శ్రీధర్‌రెడ్డి, కృష్ణ ఏఎస్‌ఎల్‌లో పాల్గొని స్థానిక యంత్రాంగంతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అరుణారెడ్డి, దేవసహాయం, కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.


