కందనూలు: దళారుల చేతిలో మోసపోయిన రైతులకు న్యాయం చేస్తామని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. బిజినేపల్లి మండలంలో వ్యాపారుల చేతిలో మోసపోయిన మొక్కజొన్న రైతులు గురువారం పోలీస్‌స్టేషన్ ఆశ్రయించారు. సమాచా రం అందుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని రైతుల సమస్యలను తెలుసుకున్నారు. వివిధ గ్రామాలకు చెందిన వారి నుంచి రూ. 90లక్షల విలువైన మొక్కజొన్న కొనుగోలుచేసి.. డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని రైతులు గోడు వెల్లబోసుకున్నారు. తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరా రు. అనంతరం ఎస్‌ఐతో ఎమ్మెల్యే సమావేశమై.. ఏఏ గ్రామాల రైతులు దళారుల చేతిలో మోసపోయారో విచారణ జరిపి.. బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
సాగు, తాగునీరు అందించడమే లక్ష్యం
ఉప్పునుంతల: రైతులు పుష్కలంగా పంటలు పండించుకోవడానికి సరిపడా సాగునీరు, ప్రతి గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా తాగునీరు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. గురువారం ఉప్పునుంతల మండలం లత్తీపూర్ శివారులోని డిండి ప్రాజెక్టు కుడి కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా డిండి రిజర్వాయర్ నింపి, ప్రాజెక్టు కింద ఉన్న ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డిండి కుడి కాల్వ ద్వారా లత్తీపూర్, వడ్డేర గుడిసెలు, గువ్వలోనిపల్లి వరకు 325 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ఇటీవల రూ. 35లక్షలతో మరమ్మతు పనులు చేయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు పి శ్రీదేవి, మేడిసాని శ్రీలత, నాయకులు లక్ష్మీనారాయణ, తిప్పర్తి నర్సింహారెడ్డి, విజేందర్‌రెడ్డి, నర్సింహులు, నరేశ్, లింగమయ్య పాల్గొన్నారు.
పోడు భూములకు పట్టాలివ్వాలి
కొల్లాపూర్ రూరల్: జిల్లావ్యాప్తంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కొల్లాపూర్ మండలం గేమ్యానాయక్ తండాలో పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ సమీపంలోని గిరిజనులు, ఆదివాసీలు జీవనోపాధి నిమిత్తం 20 ఏళ్లుగా అటవీ భూములను సాగుచేసుకుంటున్నారని తెలిపారు. గిరిజనులకు ప్రభుత్వం పట్టాలిచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు.


