కందనూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 4న ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం సీఎం పర్యటన ఏర్పాట్లను ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్న హెలిప్యాడ్ నుంచి ఆలయానికి ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆలయ ఈఓ, అర్చకులతో సమావేశమైన కలెక్టర్.. ముఖ్యమంత్రి నిర్వహించే ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు, పూర్ణకుంభ స్వాగతం, దర్శన ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమా లు సంప్రదాయబద్ధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేలా ఏర్పాట్లు చేయా లని సూచించారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఊర్కొండ రైతువేదికలో జిల్లాస్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దేవసహాయం, అరుణరెడ్డి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి పాల్గొన్నారు.


