రాజోళి బండ..! | - | Sakshi
Sakshi News home page

రాజోళి బండ..!

Jul 2 2026 2:53 AM | Updated on Jul 2 2026 2:53 AM

45 వేల ఎకరాలకే సాగు నీరు రైతులను మభ్యపెట్టొద్దు..

ప్రశ్నార్థకంగా ఆర్డీఎస్‌ భవితవ్యం

ఆర్డీఎస్‌ కింద అలంపూర్‌ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా.. 45 వేల ఎకరాలకే అందుతోంది. యాసంగిలో నీళ్లు రాక క్రాప్‌ హాలిడే ప్రకటించడం ఏటా పరిపాటిగా మారింది. ఈ క్రమంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టింది. 2018లో నీటి పంపింగ్‌ ప్రారంభమైంది. మొత్తం మూడు మోటార్లు బిగించాల్సి ఉండగా.. 5.5 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్క మోటారు ద్వారానే వరద వచ్చినప్పుడు తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని ద్వారా డిస్ట్రిబ్యూటరీ 23, 24 నుంచి డిస్టిబ్యూటరీ 35 వరకు తడులు ఇవ్వగలుగుతున్నారు. కానీ ఆ తర్వాత నుంచి చివరి డిస్ట్రిబ్యూటరీ 40 వరకు నీరందడం లేదు. దీనికింద మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు అతీగతి లేదు.

ఇతర రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా జరిగే పనులను సాకుగా చూపి రైతులను మభ్యపెట్టొద్దు. కర్ణాటకలో జరుగుతున్న కొన్ని ప్యాకేజీ పనులు ఇప్పట్లో పూర్తి అయ్యేలా లేవు. దాని కోసం ఎదురుచూడటం వృథా. ప్రస్తుతం వర్షాలు లేకపోయినప్పటికీ, తు మ్మిళ్ల లిఫ్టు ద్వారా విడుదల అవుతున్న నీటి తో ఆయకట్టుకు జీవం ఉంది. రిజ ర్వాయర్‌ నిర్మించి ఉంటే నీటి నిల్వ ఉంచుకుని మరో నెలరోజులు పాటు అందించుకునేవాళ్లం. ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాలి.

– సీతారామిరెడ్డి, ఆర్‌డీఎస్‌ మాజీ చైర్మన్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కర్ణాటక, ఏపీ, తెలంగాణ.. ఈ మూడు రాష్ట్రాలతో ముడిపడిన రాజోళి బండ డైవర్షన్‌ స్కీం(ఆర్డీఎస్‌) పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తుంగభద్రపై నిర్మించిన ఈ పథకం ద్వారా తెలంగాణలోని నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకపోగా.. ప్రస్తుతం దీని భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. నిజాం కాలం నాటి ఈ ప్రాజెక్ట్‌ ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ఆనకట్ట, కాల్వలు అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరాయి. మరోవైపు ఎగువన కర్ణాటకలో ఈ నదిపై అక్రమంగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు రాష్ట్రంలోని నడిగడ్డ రైతులకు శాపంగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతుల దీనగాధపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌..

ప్రాజెక్ట్‌ నేపథ్యం..

కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ జిల్లా మాన్వి తాలుకాలో తుంగభద్ర నదిపై నిర్మించిన ఆర్డీఎస్‌ 1958లో అందుబాటులోకి వచ్చింది. మొత్తం 143 కిలోమీటర్ల పొడవున (కర్ణాటకలో 43 కి.మీ.లు, తెలంగాణలోని గద్వాల జిల్లాలో 100 కి.మీ.లు) కాల్వ నిర్మించారు. ఆర్డీఎస్‌కు మొత్తం 17.1 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇందులో కర్ణాటకకు 1.2 టీఎంసీలు.. తెలంగాణకు 15.9 టీఎంసీలు. తుంగభద్ర నది నుంచి 10 టీఎంసీలు, తుంగభద్ర డ్యాం నుంచి 7.1 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉంది. ఒకటి నుంచి 12 డిస్ట్రిబ్యూటరీలు కర్ణాటకలో.. 13 నుంచి 42 వరకు నడిగడ్డ ప్రాంతంలో ఉన్నాయి. ఆర్డీఎస్‌ ఆనకట్ట పొడవు 850 మీటర్లు. తెలంగాణకు వచ్చే కాల్వ ఎడమవైపు ఉండగా.. కుడి వైపున ఏపీ సరిహద్దు ఉంటుంది.

2006లో ఆధునికీకరణ

ఆర్డీఎస్‌ హెడ్‌ రెగ్యులేటరీ వద్ద ఏళ్ల తరబడి ఏపీ, తెలంగాణ రైతుల మధ్య వివాదం కొనసాగింది. 2001లో ఇరు ప్రాంతాల రైతులు దాడులకు దిగడంతో ఆర్టీఎస్‌ శాశ్వత పరిష్కారం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఆనకట్ట వద్ద వివాదాలకు కారణంగా ఉన్న స్లూయిస్‌ను మూసివేయించారు. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం ఆర్టీఎస్‌ ఆధునికీకరణకు రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.58 కోట్లను కర్ణాటకకు అందజేశారు. అయితే నాలుగు ప్యాకేజీల్లోనూ అరకొర పనులు చేసి అక్కడి ప్రభుత్వం చేతులు దులుపుకోగా.. ఆ తర్వాత ఆధునికీకరణ అటకెక్కింది. ఏడు దశాబ్దాల క్రితం గచ్చుతో నిర్మించిన ఆర్టీఎస్‌ ఆనకట్ట బలహీనపడింది. ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడంతో ఇసుక, బురద పేరుకుపోయింది. 12ఏ డిస్ట్రిబ్యూటరీ తెలంగాణలోని సింధనూరు నుంచి ప్రారంభం కానుండగా.. ఇక్కడి నుంచి కాల్వల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.

ఎగువన కొత్త పథకాలు..

తెలంగాణ వాటాలో 5 నుంచి 6 టీఎంసీలకు మించి ఏనాడూ వాడుకోలేదు. కర్ణాటకలో కేవలం దీని కింద 5,880 ఎకరాలు ఉన్నా.. అక్రమంగా నీటిని వాడుకుంటూ 15 వేల ఎకరాల దాకా సాగుచేస్తున్నారు. కాగా.. కర్ణాటకలో ఆర్డీఎస్‌పై అక్రమ కట్టడా లు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనధికారికంగా జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్మించారు. తాజాగా ఆర్టీఎస్‌ హెడ్‌వర్క్‌ వద్ద తాగునీటి అవసరాల కోసమని 100 మీటర్ల దూరంలో ఎగువన 2 టీఎంసీల నీటిని ఎత్తి పోసేలా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. దీంతో నడిగడ్డ రైతుల్లో ఆందోళన నెలకొంది.

తెలంగాణకు వచ్చే కాల్వల లైనింగ్‌

దెబ్బతిన్న దృశ్యం

అటకెక్కిన ఆధునికీకరణ..

అధ్వానంగా ఆనకట్ట, కాల్వలు

కర్ణాటకలో మోటార్లతో యథేచ్ఛగా నీటి చౌర్యం

జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌లకు విచ్చలవిడిగా నీటి వినియోగం

అక్రమంగా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మాణం

నడిగడ్డకు పొంచి ఉన్న ముప్పు.. రైతుల్లో ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement