అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి ఆలయాన్ని బుధవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతిస్వామి సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ ఈఓ దీప్తిరెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ సన్నిధిలో శ్రీచక్రయంత్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలయంలో శ్రీవిధుశేఖర భారతిస్వామి పూజలు నిర్వహించి.. మంగళహారతి సమర్పించారు. ఇదిలా ఉంటే.. శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రెండోరోజు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. గురువారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతిస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ చక్ర యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: విదేశాల్లో మాస్టర్ డిగ్రీ విద్యను అభ్యసించేందుకు ఉపకార వేతనాల కోసం అంబేడ్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం ద్వారా 2026 విద్యా సంవత్సరానికి ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఉమాపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండి 35 ఏళ్లలోపు ఎస్సీ అభ్యర్థులు http://telanganaepass.cgg.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రేపు రాష్ట్రస్థాయి
అథ్లెటిక్స్ ఎంపికలు
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్ర అథ్లెటిక్ చాంపియన్‌షిప్–2026 కోసం క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్‌యాదవ్, కార్యదర్శి స్వాములు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–16, 20 విభాగంలో పురుషులు, మహిళల ఎంపికలు ఉంటాయని, జూలై 17 నాటికి 20 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. పోటీల్లో సత్తాచాటిన వారికి ఈ నెల 18న మెదక్ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నం.98664 69054ను సంప్రదించాలని సూచించారు.
పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి
కందనూలు: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారుబాబు అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని శ్రీపురం చౌరాస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిగ్రీ కళాశాల, ఇంటర్ కళాశాలలో స్కాలర్‌షిప్‌లు అందక పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ జిల్లా కార్యదర్శి శాంతన్, నగర సంయుక్త కార్యదర్శి శివ, విష్ణు, జీవన్, భాను, మహేష్, చందు, సందీప్, మహేష్, రాకేష్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మోజర్ల సమీపంలోని ఉద్యాన కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డా.వీణ జోషి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బైపీసీ విద్యార్థుల కోసం నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని.. ఈ నెల 29వ తేదీలోగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని.. దరఖాస్తుల సమర్పణకు 30 వరకు గడువు ఉందన్నారు. దరఖాస్తులోని వివరాల సవరణకు ఆగస్టు 1న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హత గల విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ rktfhu.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని.. మరిన్ని వివరాలకు 89771 29027, 76830 53157 నంబర్లను సంప్రదించాలని కోరారు.


