కందనూలు: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోపాటు ప్రతి చిన్నారికి విద్యాహక్కు కల్పించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. బుధవారం జిల్లా కోర్టు భవనంలోని సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన 12వ ఆపరేషన్ ముస్కాన్–2026 సమన్వయ సమావేశానికి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బుధవారం నుంచి జూలై 31 వరకు నిర్వహించే 12వ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి, పాఠశాల వయస్సు గల ప్రతి బాల, బాలికలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. ఆర్థిక, కుటుంబ లేదా ఇతర కారణాలతో పిల్లలు చదువుకు దూరమై పనుల్లో చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని హోటళ్లు, టీ దుకాణాలు, గ్యారేజీలు, పరిశ్రమలు, నిర్మాణ పనులు, ఇటుక బట్టీలు, వ్యవసాయ క్షేత్రాలు తదితర ప్రాంతాల్లో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వారిని వెంటనే రక్షించాలని, వారిని పనిలో పెట్టుకున్న యజమానులపై బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి చిన్నారి సురక్షిత బాల్యం, నాణ్యమైన విద్యను పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో విద్య, కార్మిక, మహిళాశిశు, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ మాట్లాడుతూ ప్రతి పోలీసు అధికారి బాలల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శ్రీదేవి, సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి దమయంతి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


