కల్వకుర్తి టౌన్: ప్రజా, దేశ అభివృద్ధి కోసం నిర్వహించే విశ్వశాంతి మహాయాగం విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమం అని ఎంపీ మల్లురవి అన్నారు. పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవానికి బుధవారం స్వరూపానంద స్వామీజీ, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి యాగవేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు సిద్ధించడంతోపాటు, ఇలాంటి మహాయాగాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ.. సనాతన ధర్మ పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. కల్వకుర్తిలో ఇంతటి మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. మహాయాగ మహోత్సవానికి నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ పాల్గొని యాగాన్ని విజయవంతం చేయాలని కోరారు. విశ్వశాంతి, లోకకల్యాణం, ప్రజల ఆయురారోగ్యాలు, సుభిక్షం కోసం ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాయాగం విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పిస్తామని మున్సిపల్ చైర్మన్ రత్నమాల వెల్లడించారు. యాగ కార్యక్రమం ఈ నెల 19 నుంచి వచ్చేనెల 3 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. అనంతరం కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.


