కందనూలు: ఎస్‌ఐఆర్ పారదర్శకంగా జరగాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. జిల్లా పర్యటన సందర్భంగా కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కలెక్టర్, ఎస్పీతో సమావేశమయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు. అలాగే జిల్లాలో కొనసాగుతున్న వివిధ కార్యక్రమాలు, పరిపాలనా అంశాలపై కలెక్టర్, ఎస్పీ కమిషనర్‌కు వివరించారు. ఓటరు జాబితా నవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు లు, మరణించిన ఓటర్ల తొలగింపు, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటుహక్కు కల్పించే దిశగా చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.


