● అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా ప్రత్యేకాధికారి షఫీయుల్లా
కందనూలు/వెల్దండ: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక నిరంతర ప్రక్రియ అని జిల్లా ప్రత్యేకాధికారి షఫీయుల్లా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు రూపొందించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ వినూత్నమైనదని అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అమలులో రాష్ట్రంలోనే జిల్లా ఆదర్శవంతమైన పనితీరు కనబరుస్తోందని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ.. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను వేగంగా అందిస్తోందన్నారు. కలెక్టర్ నాయకత్వంలో అధికారులు గ్రామస్థాయిలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కార చర్యలు చేపడుతున్న తీరు అభినందనీయమన్నారు. వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామాన్ని స్వయంగా సందర్శించి.. అక్కడ నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు షఫీయుల్లా తెలిపారు. గృహ నిర్మాణాల నాణ్యతను పరిశీలించడంతో పాటు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నామన్నారు. సొంతింటి కల సాకారమవుతున్న తరుణంలో లబ్ధిదారులు వ్యక్తంచేసిన సంతోషం తనను ఎంతో ఆనందానికి గురిచేసిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన విశ్వాసానికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకమే నిదర్శనమని అన్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై పౌరసరఫరాలశాఖ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలు, సాధించిన ఫలితాలను కలెక్టర్ వివరించారు.


