కందనూలు: ఐదేళ్లలోపు చిన్నారులందరికీ విధిగా పోలియో చుక్కల మందు వేయించి.. పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లా ఆస్పత్రిలో జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లావ్యాప్తంగా పల్స్‌పోలియో నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పోలియో కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలియో శాశ్వత వైకల్యానికి దారితీసే అత్యంత ప్రమాదకర వ్యాధి అయినప్పటికీ.. కేవలం రెండు చుక్కల వ్యాక్సిన్‌తో దాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు. ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకుండా వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. మొదటి రోజు పోలియో కేంద్రాలకు రాని చిన్నారులను గుర్తించి.. తదుపరి రోజుల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన తండాలు, మారుమూల పల్లెలు, వలస కూలీల పిల్లలు, నిర్మాణ కార్మికుల పిల్లలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు కూడా పోలియో చుక్కల మందు అందేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు ఆయన వివరించారు. డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్లలోపు వయసు కలిగిన 1,00,624 మంది చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు 1,17,500 డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులు, ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


