యూరియా పంపిణీలో అలసత్వం వహించొద్దు
పెద్దకొత్తపల్లి: యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 6 గంటల నుంచే పంపిణీ చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ, ఆన్‌లైన్ నమోదును పరిశీలించారు. రైతుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సరఫరాలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఒకే సింగిల్ విండో వద్ద కాకుండా పంపిణీ కేంద్రాలను ఇతర గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. సింగిల్ విండో కార్యాలయంలోనే యూరియా నిల్వ చేయడం వలన ఇతర గ్రామాల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పెద్ద గ్రామాల్లో యూరియా పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయాధికారులు ప్రైవేటు, ప్రభుత్వ డీలర్లు అమ్ముతున్న యూరియా స్టాక్‌ను పర్యవేక్షించాలన్నారు. ప్రైవేటు డీలర్లు అధిక రేట్లకు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రోజువారీగా రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని. ప్రతి రైతుకు మూడు బస్తాల యూరియా ఇవ్వాలని చెప్పారు. అనంతరం సాతాపూర్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ నాణ్యత, తేమ గురించి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, మండల వ్యవసాయాధికారి శిరీష, డీపీఎం కృష్ణయ్య, ఏపీఎం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


