ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్‌కర్నూల్: జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇంటర్ పరీక్షలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 13,547 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. వీరికోసం 34 కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరకు కొనసాగుతాయన్నారు. ప్రశ్నపత్రాల స్టోరేజ్ పాయింట్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించాలని చెప్పారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలని సూచించారు. విద్యా, వైద్య, రవాణ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలు విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఐఈఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


