పిల్లలు.. వృద్ధులు.. జాగ్రత్త
ప్రశ్న: చలికాలంలో వృద్ధులు ఎలాంటి
జాగ్రత్తలు పాటించాలి.
– రవీందర్, అచ్చంపేట, రాము, వంగూరు
డీఎంహెచ్‌ఓ : చలికాలంలో చంటిపిల్లలతోపాటు 60 ఏళ్లు దాటిన వృద్ధులు సైతం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో చలిలో బయటకు వెళ్లొద్దు. గది కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. బీపీ ఉన్నవారు అధిక చలికి హైపోథర్మియా పరిస్థితికి లోనుకావచ్చు. ఈ పరిస్థితిలో ఆకస్మిక గుండెపోటు, పక్షవాతానికి దారితీయవచ్చు.
జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, చలిగాలుల నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవికుమార్ అన్నారు. చలికాలంలో వైరస్, బ్యాక్టీరియా అధికంగా వృద్ధిచెందే అవకాశం ఉండటంతో వీరు ఎక్కువగా ఇన్‌ఫెక్షన్ బారినపడే అవకాశం ఉందన్నారు. వృద్ధుల్లో ప్రధానంగా బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు
మరింత అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. చలి తీవ్రత పెరిగితే వృద్ధులు హైపో థర్మియా పరిస్థితికిలోనై పక్షవాతం, గుండెపోటు బారినపడవచ్చన్నారు. చలితీవ్రత నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’
నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చారు.
– సాక్షి, నాగర్‌కర్నూల్
ప్రశ్న : మా పాపకు తరచుగా దగ్గు, జలుబు, జ్వరంతోపాటు వాంతులు అవుతున్నాయి. తగ్గడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
– బాలరాజు, పెంట్లవెల్లి
డీఎంహెచ్‌ఓ : చలికాలంలో గాలి ద్వారా వైరస్, బ్యాక్టీరియా అధికంగా వృద్ధిచెందుతాయి. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. పిల్లల శరీరాన్ని అంతటా ఉన్నిదుస్తులు ధరించేలా చూసుకోవాలి. చేతులు, కాళ్లు సైతం గ్లౌవ్స్, సాక్స్‌లతో కవర్ చేయాలి. చలిలో ఆరుబయటకు వెళ్లకూడదు. చల్లని నీరు కాకుండా గోరువెచ్చని నీటిని తాగించాలి. చేతి వేళ్లు నోట్లో పెట్టుకోకుండా చూడాలి. చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆయాసం ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.
ప్రశ్న: తరుచుగా గొంతునొప్పి వస్తోంది. వారం రోజులైనా జలుబు తగ్గడం లేదు.
– లక్ష్మణ్, కార్వంగ, తెలకపల్లి
డీఎంహెచ్‌ఓ : జలుబు, గొంతు నొప్పి సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా ఐదు నుంచి ఏడు రోజుల పాటు సిరప్, మందులు వాడాలి. చికిత్స కోర్సు పూర్తి చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. గోరువెచ్చని నీరు తాగుతూ బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఈ కాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి పెంచుకునేందుకు ప్రయత్నించాలి. విటమిన్ సీ, ఈ అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి.
ప్రశ్న : ప్రైవేటు ఆస్పత్రుల్లో నెబ్యులైజర్ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఈ అవసరం ఉంటుందా.?
– శివ, తాడూరు
డీఎంహెచ్‌ఓ : చలికాలంలో రక్తనాళాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇందుకోసం జలుబు చేసి నప్పుడు ఆవిరి పట్టుకోవడంఉత్తమం. నెబ్యులైజర్‌తో తాత్కాలికమే కానీ శాశ్వత ప్రయోజనం ఉండదు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే ఇన్‌హేలర్స్ వాడుకోవచ్చు.
రపశ్న : చిన్నపిల్లలకు ఆక్సిజన్ ఏయే సమయాల్లో అవసరం పడుతుంది. ఏరియా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉందా.?
– బాలాజీ, అచ్చంపేట
డీఎంహెచ్‌ఓ : ఆక్సిజన్ అన్నింటికీ అవసరం ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే ఆక్సిజన్ అవసరం. న్యూమోని యా, ఆస్తమా, పిల్లలు డొక్కలు ఎగరేయడం వంటి సందర్భాల్లో ఆక్సిజన్ ఇవ్వాలి. ఆక్సిజన్ సాచ్యూరేషన్ 95 వరకు ఉంటే పర్వాలేదు. అంతకన్నా తగ్గితే ఆక్సిజన్ అవసరం పడుతుంది. జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉంది.
ప్రశ్న : పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలకు జలుబు, దగ్గు ఉంటోంది. విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
– చంద్రశేఖర్, గౌరారం, తెలకపల్లి
డీఎంహెచ్‌ఓ : చలికాలంలో విద్యార్థులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు, తరగతి గదుల్లో మాస్క్ ధరించాలి. తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ లేదా మోచేయి అడ్డుగా పెట్టుకోవాలి. చల్లని నీరు, కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీం లాంటివి తీసుకోవద్దు. చల్లగా లేకుండా గోరువెచ్చగా ఉండే నీరు తాగాలి.
చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ముందస్తు చర్యలు తప్పనిసరి
ఉదయం, రాత్రివేళల్లో ఆరుబయటకు వెళ్లొద్దు
వృద్ధుల్లో హైపోథర్మియా ప్రభావంతో గుండెపోటు, పక్షపాతానికి అవకాశం
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో అందుబాటులో మందులు
‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రవికుమార్
ప్రశ్న : జనరల్ ఆస్పత్రిలో అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి. ఎమ్మారై సదుపాయం కల్పించాలి.
– రాజశేఖర్‌శర్మ, నాగర్‌కర్నూల్
డీఎంహెచ్‌ఓ : జనరల్ ఆస్పత్రిలో ఇప్పటికే అభివృద్ధి కమిటీ ఉంది. కలెక్టర్, ఎమ్మెల్యేల సహకారంతో కమిటీని క్రియాశీలకం చేస్తాం. అలాగే సదుపాయాలు కల్పిస్తాం.
ప్రశ్న: చలికాలంలో స్కిన్ ఎలర్జీ ఎక్కువగా ఉంటోంది. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.?
– శ్రీధర్, అచ్చంపేట
డీఎంహెచ్‌ఓ : చలికాలంలో శరీరానికి ప్రత్యేకంగా మాశ్చరైజర్ క్రీం, ఎలొవేరా జెల్ వంటివి రాసుకోవాలి. ఇవేమీ లేకున్నా కొబ్బరి నూనె రాసుకున్నా సరిపోతుంది. చాలామంది ఎండాకాలంలోనే నీటిని ఎక్కువగా తీసుకోవాలని అనుకుంటారు. చలికాలంలో నీరు ఎక్కువగా తీసుకోరు. దీంతో చర్మం పొడిబారి చర్మ సమస్యలకు దారితీస్తుంది. చలికాలంలోనూ ఎక్కువగా నీటిని తాగాలి. సమస్య వచ్చినప్పుడు చికిత్స కన్నా అప్రమత్తతో ఉండటమే ముఖ్యం.
పిల్లలు.. వృద్ధులు.. జాగ్రత్త


