యూరియా సరఫరాకు పటిష్ట చర్యలు
నాగర్‌కర్నూల్: జిల్లాలో యూరియా సరఫరా చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావుతో కలిసి సోమవారం యూరియా, ఎరువుల లభ్యతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించి సూచనలు చేశారు. కలెక్టరేట్ నుంచి వీసీలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఏఓ యశ్వంతరావుతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎక్కడా యూరియా కొరత రాకుండా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి పక్కా సమాచారంతో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు యూరియా విక్రయాలు ప్రారంభిస్తున్నామన్నారు. అవసరమైన చోట అదనపు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. వీసీ అనంతరం స్థానిక అధికారులతో మాట్లాడుతూ విక్రయ కేంద్రాలకు యూరియా సరఫరా తగినంతగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడా అంతరాయం లేకుండా స్టాక్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లా రైతులు ఆందోళన చెందవద్దని, అవసరమైన యూరియా పూర్తిగా అందుబాటులో ఉందని చెప్పారు. యూరియా పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా చేపడతామన్నారు.


