సాగులో నూతన ఒరవడి
ఉమ్మడి జిల్లాలో 2024, 2025లో వానాకాలం పంటల సాగు ఇలా...
పాలమూరులో వినూత్న పంటల వైపు రైతుల మొగ్గు
● పలుచోట్ల ఆయిల్‌పాం,
వాణిజ్య తోటల పెంపకం
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా తగ్గిన పత్తి సాగు, దిగుబడి
● తీవ్ర నష్టాలు మిగిల్చిన
వానాకాలం సీజన్
● యూరియా కోసం రైతాంగానికి తప్పని పడిగాపులు
తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో కురిసిన వర్షాల వల్ల ఎర్ర తెగులు సోకిన పత్తి పంట (ఫైల్)
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు రైతులు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంతటా ఈసారి పత్తి కన్నా.. వరి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. పలుచోట్ల ఆయిల్‌పాం, ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు ఆసక్తి చూపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈసారి 900 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు సాగైంది. గద్వాల జిల్లాలో పొగాకు, వనపర్తి జిల్లాలో చెరకు, బెబ్బర పంటలు పండించారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మిగతా మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు గతేడాది కన్నా ఈసారి వానాకాలంలో వరి, పత్తి పంటలు అధికంగా సాగుచేశారు. కానీ, జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట సాగుచేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంట దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోయింది. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.
సాగులో నూతన ఒరవడి


