సృజనాత్మకతకు వేదిక వైజ్ఞానిక ప్రదర్శన
● అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్
● ఆకట్టుకున్న విద్యార్థుల
సాంస్కృతిక కార్యక్రమాలు
కందనూలు: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై డీఈఓ రమేష్‌కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే కొత్త ఆలోచనలపై దృష్టిసారించి సాంకేతిక రంగంలో ఎదగాలని సూచించారు. రోజురోజుకు సాంకేతిక రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా ఆలోచనలకు పదును పెట్టాలన్నారు. సైన్స్ అంటేనే నిజమని, ప్రకృతిలో దాగి ఉన్న ఎన్నో విషయాలను సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. సైన్స్‌ను అలవర్చుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్లగలమని పేర్కొన్నారు. నేటి సమాజంలోని సమస్యలకు పరిష్కారం సైన్స్ ఒక్కటే మార్గమని, అది సృజనాత్మక ఆలోచనలతోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. మూడురోజులపాటు కొనసాగే వైజ్ఞానిక ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డీఈఓ రమేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారన్నారు. అనంతరం కేజీబీవీ తాడూరు, కేజీబీవీ పెద్దకొత్తపల్లి, కేకేరెడ్డి పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్‌రావు, నోడల్ అధికారి కుర్మయ్య, ఏసీ రాజశేఖర్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


