అనర్హులకు ఇళ్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు
నాగర్‌కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తాడూరు, తెలకపల్లి, నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాలు, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అర్హుల జాబితాపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్‌తో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు.. ఎన్ని దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.. మార్కింగ్ అయినవి ఎన్ని.. నిర్మాణ పనులు ప్రారంభించినవి ఎన్ని అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిరుపేదలకు సొంతింటిని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయొద్దని, అర్హులకు మాత్రమే కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఏ రోజుకారోజు సర్వే చేసిన లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వాటి పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ ఆర్డీఓ సురేష్, గృహ నిర్మాణాధికారి సంగప్ప, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


