సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ వైఖరి సరికాదు
కందనూలు: దీర్ఘకాలంగా ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ అన్నారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ అధ్యక్షతన సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సర్వీసు, వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగడం శోచనీయమన్నారు. ఎన్నికల సమయంలో అన్ని సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఉపాధ్యాయ, ఉద్యోగులతోపాటు పదవీ విరమణ పొందిన వారికి కూడా వివిధ రకాల ఆర్థిక బిల్లులు చెల్లింపులో ఏళ్ల తరబడి జాప్యం జరిగిందని, ఇప్పటికై నా వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక తక్షణమే తెప్పించుకుని మెరుగైన ఫిట్‌మెంట్‌తో కొత్త వేతన సవరణ అమలు చేయాలని, బకాయి పడిన 5 డీఏలను తక్షణమే చెల్లించాలని, 317 జీఓతో ఎదురైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ ‘మన ఊరు మనబడి’లో అర్ధాంతరంగా ఆగిపోయిన పాఠశాల భవనాల నిర్మాణం పూర్తి చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, పాఠశాలల్లో శాశ్వతంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌శర్మ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ నిధి బోర్డు డైరెక్టర్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


