ముస్తాబైన నూతన కలెక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

ముస్తాబైన నూతన కలెక్టరేట్‌

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

ములుగు: ప్రజల చెంతకే పాలన లక్ష్యంగా ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలతో కళకళలాడనుంది. ములుగు పట్టణ శివారులోని గట్టమ్మ ఆలయ సమీపంలో రూ.63.50 కోట్లతో 16 ఎకరాల వీస్తీర్ణంలో నూతన హంగులతో కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించారు. ఇందులో రూ.8.50 కోట్లతో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ భవనాలను నిర్మించారు. 2023 జూన్‌ 7న గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా మూడేళ్ల పాటు పనులు కొనసాగాయి. పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

నూతన కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. అదే విధంగా గట్టమ్మ ఎదురుగా పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన హ్యామ్‌ రోడ్ల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఇంచర్ల సమీపంలో నిర్మించిన ఇందిర మహిళా శక్తి భవనాన్ని, ములుగు మండలంలోని పొట్లాపూర్‌ ఎత్తిపోతల పథకాన్ని, మంగపేట, మల్లంపల్లిలో నిర్మించే తహసీల్దార్‌ కార్యాలయాల భవనాలను వర్చువల్‌ విధానంలో సీఎం ఆవిష్కరించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించనున్న పంచాయితీరాజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయం, ఏటూరునాగారంలోని ఏటీడీఏ భవనం, ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనం, మంగపేట– మణుగూరు, బ్రహ్మణపల్లి– కాటాపూర్‌ రోడ్ల పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది.

జిల్లా పాలనకు కేరాఫ్‌గా గట్టమ్మ తల్లి

జిల్లా పరిపాలనకు కేరాఫ్‌ అడ్రస్‌గా గట్టమ్మ తల్లి వద్ద నిర్మించిన నూతన కలెక్టరేట్‌ నిలవనుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు వివిధ చోట్ల ఉండడంతో కార్యాలయాల చిరునామా గుర్తించడంలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే చోటకు రానుండడంతో ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువకానుంది. విశాలమైన కార్యాలయ గదులు, అధునిక హంగులతో నిర్మించిన కాన్ఫరెన్స్‌ హాల్స్‌, డిజిటల్‌ నెట్‌వర్కింగ్‌ సదుపాయాలు, పార్కింగ్‌ వసతి, ఆహ్లాదకరమైన పరిసర ప్రాంతాలతో నూతన కలెక్టరేట్‌ భవనాన్ని తీర్దిదిద్దారు.

సీఎం పర్యటన ఇలా..

ఈనెల 16న మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలోని మే డారం చేరుకోనున్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం అనంతరం అక్కడి నుంచే రాష్ట్రంలోని వితంతువు, ఒంటరి మహిళలకు ఫించన్లు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నా రు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని గట్టమ్మ వద్ద నిర్మించిన పైలాన్‌ను ప్రారంభిస్తారు. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి.. గట్టమ్మ తల్లిని దర్శించుకోనున్నట్లు సమాచారం. కలెక్టరేట్‌ భవనంతోపాటు వివిధ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించిన అనంతరం పరకాలలో జరిగే బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనున్నారు. ఇదిలా ఉండగా.. మంత్రి సీతక్కకు సైతం కలెక్టరేట్‌లో ప్రత్యేక ఛాంబర్‌ కేటాయించినట్లు తెలిసింది.

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా

రేపు ప్రారంభం

రూ.63.50 కోట్లతో నిర్మాణం

ఒకే చోట కొలువుదీరనున్న జిల్లా

కార్యాలయాలు

ప్రజలకు చేరువకానున్న ప్రభుత్వ పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement