● అధికారులు అప్రమత్తంగా బాధ్యతలు నిర్వర్తించాలి
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా.. అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది డ్యూటీ పాసులు, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. మేడారం వనదేవతల ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, నూతన కలెక్టరేట్, పైలాన్, గట్టమ్మ ఆలయ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేడారంలో వనదేవతల దర్శనం, పింఛన్ల పంపిణీ కార్యక్రమాలతోపాటు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, సభా ప్రాంగణంలో చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు.
నూతన కలెక్టరేట్, పైలాన్ పరిశీలన
గట్టమ్మ ఆలయ సమీపంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం, పైలాన్ తుది దశ పనులను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా మిగిలిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్‌రావు, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్వో రవికుమార్, ఆర్ అండ్ బీ అధికారి శ్యామ్ సింగ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎస్‌ఈ ఈడీ ధర్మనాయక్ పాల్గొన్నారు.


