ములుగు రూరల్: దేశ భద్రతలో యువత ముందుండాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. మల్లంపల్లి మండలకేంద్రంలో మండల అధ్యక్షుడు బైకాని మహేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం హర్‌ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అంబేడ్కర్ సెంటర్ నుంచి జాతీయ రహదారిపై కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బలరాం మాట్లాడుతూ.. ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని అన్నారు. దేశ పౌరులు ఐక్యత, సమానత్వానికి కట్టుబడి ఉండాలన్నారు. ర్యాలీలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, స్వరూప, రాజ్‌కుమార్, కుమార్, రవి, యుగందర్, రాజేందర్, సురేష్ , శ్రీకాంత్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి ఒడ్డున
టేకు దుంగలు లభ్యం
వెంకటాపురం(కె): మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నది ఒడ్డున ఐదు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపురం అటవీశాఖ అధికారి ముక్తార్ అహ్మద్ మాట్లాడుతూ.. బెస్తగూడెం గోదావరి నది ఒడ్డున ఐదు టేకు దుంగలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం వచ్చిందని తెలిపారు. సిబ్బందితో కలిసి గోదావరి నది ఒడ్డుకు వెళ్లి ఐదు టేకు దుంగలను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.45 వేల వరకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది లాలు, బాబు, బేస్ క్యాంప్ సిబ్బంది ఉన్నారు.
ఇంటిలో అరుదైన
బ్యాండెడ్ క్రైట్ పాము
ఏటూరునాగారం: అత్యంత విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పామును స్థానిక అటవీశాఖ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. మండల కేంద్రానికి చెందిన రాజు కొత్త ఇళ్లు నిర్మించుకోగా అందులో అరుదైన అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. దీంతో స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే ఎఫ్‌బీఓ దయానంద్, బేస్‌క్యాంప్ సిబ్బంది ఇంటిలో వెతకగా బ్యాండెడ్ క్రైట్ పాము అని, చాలా విషపూరితమైన పాము అని చెప్పడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ సిబ్బంది చాకచక్యంగా దానిని పట్టుకొని దట్టమైన అడవిలో వదిలేశారు. దీంతో చుట్టూ పక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తారు వేసారా.. పూసారా?
ఈఫొటోల్లోని రోడ్డుపై ఏదో పూసినట్టుగా కనిపిస్తుందా.. అయితే మీరు పొరబడినట్టే..! ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నది రోడ్డు మరమ్మతు.. అవును.. మీరు చదివింది నిజమే.. ఏటూరునాగారం మండలం కేంద్రంలోని 163 జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పలు కథనాలు ప్రచురించాం. దీంతో స్పందించిన సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు శుక్రవారం ఇలా గుంతలు ఉన్నచోట అతుకులా తారు పూసి వదిలేశారు. మరమ్మతుల పేరుతో ౖపైపె మెరుగులు దిద్దడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
– ఏటూరునాగారం


