రహదారుల అభివృద్ధి ఐకాన్‌.. | - | Sakshi
Sakshi News home page

రహదారుల అభివృద్ధి ఐకాన్‌..

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

రేపు పైలాన్‌ ఆవిష్కరించనున్న

సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి ములుగు జిల్లా వేదిక కానుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల మధ్య మెరుగైన అనుసంధానం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న భారీ రహదారి అభివృద్ధి కార్యక్రమానికి ఈ నెల 16న సీఎం రేవంత్‌ రెడ్డి ములుగు నుంచి శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి గుర్తుగా నిర్మించిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు.

రవాణా వ్యవస్థ బలోపేతం

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తొలి దశలో 2,145 రహదారులను సుమారు 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, అక్కడి నుంచి ప్రధాన రహదారులకు నిరంతర అనుసంధానం కల్పించేలా ఈ ప్రణాళికను రూపొందించారు. ప్రతీ గ్రామాన్ని మండల కేంద్రంతో రెండు వరుసల రహదారితో, మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంతో నాలుగు వరుసల రహదారితో, జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర కేంద్రంతో ఆరు వరుసల రహదారితో అనుసంధానించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రహదారుల నిర్మాణాన్ని హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో చేపట్టనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత 15 సంవత్సరాలపాటు సంబంధిత నిర్మాణ సంస్థలే రహదారుల నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో రహదారుల నిర్మాణంతోపాటు వాటి నాణ్యత, మన్నికకు కూడా భరోసా కలగనుంది. రహదారుల అభివృద్ధికి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement