మంగపేట : మండలంలోని నర్సింహాసాగర్ పంచాయతీ పరిధిలో గొందిగూడెనికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తాటి శశికుమార్ (32) దారుణ హత్యకు గురయ్యాడు.ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. శశికుమార్ రాంనగర్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన గల ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి నిందితులు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. గురువారం ఉదయం విషయం తెలిసిన వెంటనే ఏటూరునాగారం సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై టీవీఆర్ సూరి సిబ్బందితో హత్య జరిగిన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య జరిగిన ఇంట్లో మృతుడితో పాటు ఎవరెవరు ఉంటున్నారు, రాత్రి ఎవరెవరు ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఇంట్లో మృతుడితో పాటు మండలంలోని పూరేడుపల్లికి చెందిన కొప్పుల నర్సింహారావు, లక్ష్మి దంపతులు ఉంటున్నారు. హత్య జరిగిన రాత్రి కూడా వారే ఉన్నట్లు వెల్లడి కావడంతో ఇద్దరిని అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కొంతకాలంగా తన భార్యను వేధిస్తుండటంతో తామే హత్యచేసినట్లు నర్సింహారావు, లక్ష్మి దంపతులు ఒప్పుకున్నట్లు సమాచారం. ఎస్సై సూరిని వివరణ కోరగా మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


