ములుగు: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ తెలంగాణ ఆధ్వర్యంలో బిట్స్‌పిలానీ హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే కుటుంబం బాగుపడుతుందని అలాగే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళల సామర్థ్యంపై సీఎం రేవంత్‌రెడ్డికి అపారమైన నమ్మకం ఉందని వివరించారు. అందుకే మహిళా సంఘాలకు వివిధ వ్యాపార, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారని వివరించారు. వడ్డీలేని రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు మహిళా సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లిస్తోందని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు రూ.13 కోట్ల వడ్డీ మొత్తాన్ని మహిళలకు తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు. మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంత వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. తద్వారా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. బిట్స్ పిలానీ సహకారంతో అందించే శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మేడారం సమ్మక్క–సారలమ్మ, రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, బొగత జలపాతం, గోదావరి తీరం, దట్టమైన అడవులతో జిల్లా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సుమారు రూ.1.50కోట్లతో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, డీఆర్డీఓ రవీందర్, బిట్స్ పిలానీ ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్ కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె.అనూష తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లు
పకడ్బందీగా పూర్తిచేయాలి
ఈనెల 16న సీఎం జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క విలేకర్లతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి 16న ములుగు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో మేడారం చేరుకుని వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తదితర వివరాలను వెల్లడించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క


