వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం అద్భుతంగా ఉందని పలువురు పర్యాటకులు కొనియాడారు. ఈ మేరకు గురువారం సినీనటుడు అప్పాజీ అంబరీష దర్బా, ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దిల్బాగ్‌సింగ్ వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు ఆయనకి స్వాగతం పలికారు. రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ వారికి వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. అనంతరం అప్పాజీ అంబరీష శ్రీమంతుడు, కిక్, జవాన్, ఇదం జగత్, శుభలేఖలు, మను, పడిపడి లేచే మనస్సు, హుషారు తదితర సినిమాల్లో నటించారు. వారి వెంట టూరిస్ట్ పోలీసు భద్రు, శ్రీకాంత్, దేవాదాయ, పురావస్తు టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు.
సమస్యల
పరిష్కారానికి కృషి
ఏటూరునాగారం: గొత్తికోయల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా ఆత్మకమిటీ చైర్మన్ చిటమట రఘు అన్నారు. మండల కేంద్రంలో అటవీశాఖ కార్యాలయంలో తాడ్వాయి రేంజర్ రమేశ్, డీఆర్‌ఓ కృష్ణవేణితో కలిసి రఘు గొత్తికోయలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోత్తికోయలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు చేల వినయ్, పీఏసీఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి పాల్గొన్నారు.
విషజ్వరంతో బాలుడి మృతి
ఏటూరునాగారం : మండలంలోని శంకరాజుపల్లికి చెందిన బాలుడు ఆత్కూరి సందీప్ (16) విషజ్వరంతో మృతిచెందాడు. వారం రోజుల నుంచి సందీప్ జ్వరంతో బాధపడుతుండగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. జ్వరం రావడంతో ప్లేట్‌లెట్స్ తగ్గి మరణించినట్లు స్థానికులు తెలిపారు. సందీప్ మృతి చెందడంతో సర్పంచ్ దేవులపల్లి విజయ్‌కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.


