
గోదావరి పరవళ్లు.. అధికారులు అప్రమత్తం
మంగపేట : గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో మండల పరిధిలోని కమలాపురం బిల్ట్ ఇంటెక్‌వెల్ వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎర్రవాగు బ్రిడ్జి సమీపానికి గోదావరి బ్యాక్ వాటర్ చేరుకుంది. అదే విధంగా మండల కేంద్రం నుంచి బోరునర్సాపురం మధ్యలో గౌరారం వాగుపై నిర్మించిన బ్రిడ్జి సమీపంలోకి బ్యాక్ వాటర్ పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన తహసీల్దార్ రవీందర్, మండల స్పెషలాఫీసర్ సిద్ధార్థరెడ్డి, ఎంపీడీఓ భద్రునాయక్, ఎస్సై టీవీఆర్ సూరి, సురేష్, శ్రీకాంత్, ఎంపీఓ శ్రీనివాస్ కమలాపురంలోని ముంపు ప్రాంతాలైన పాతూరు, గుడ్డేలుగులపల్లి, మండల కేంద్రంలోని పొదుమూరు, ముస్లింవాడ, వడ్డెరకాలనీ, కత్తిగూడెం, దేవనగరం, వాడగూడెం, అకినేపల్లిమల్లారం గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుండడంతో ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.