చిత్ర పరిశ్రమలో నాకంటూ ఒక గుర్తింపు రావాలని ఎప్పుడూ అనుకుంటుంటాను. ఒక నటుడిగా నిరూపించుకునే అవకాశం నాకు ‘నాగబంధం’తో వచ్చింది. ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమించాను. షూటింగ్ సమయంలో నాకు జ్వరం ఉన్నా కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రాణం పెట్టి పనిచేశాను’ అన్నారు నటుడు విరాట్ కర్ణ. ఆయన హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జులై 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విరాట్ కర్ణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ ఇప్పటి వరకు నేను చేసిన రెండు సినిమాలు(పెద కాపు, నాగబంధం) భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. కెరీర్ ప్రారంభంలోనే ఇంత భారీ సినిమాలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. పెదకాపు ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఒక నటుడిగా 100 శాతం కష్టపడ్డాను. ఆ పాత్రకు కావాల్సిన ప్రతిదీ చేశాను. నటుడిగా మంచి ప్రసంశలు వచ్చాయి. ఆ సినిమా కంటే ఈ సినిమాకు రెట్టింపు కష్టపడ్డాను.
→ అభిషేక్ నామా ‘నాగబంధం’ కథను సిద్ధం చేసుకుని, ఆ పాత్రకు తగ్గ నటుడి కోసం వెతుకుతున్నారు. ఆ పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న కొత్త వ్యక్తి అయితే బాగుంటుందని అనుకున్నారు. ఆ సమయంలో నన్ను పిలిపించి మాట్లాడారు. నాకు కథ చాలా నచ్చింది. చాలా ఎగ్జైట్ అయ్యాను. అలా నాగబంధం జర్నీ మొదలైంది. తొలుత తక్కువ బడ్జెట్‌తోనే తీద్దాం అనుకున్నాం. సినిమా డెవలప్ చెందుతున్న కొద్దీ కంటెంట్ డిమాండ్ ప్రకారం బడ్జెట్ సైజ్ పెరుగుతూ రూ. 100 కోట్ల బడ్జెట్‌కి వచ్చింది.
→ నాగబంధం కథ విన్నప్పుడే నా పాత్ర ఎలా ఉండాలో ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. రుద్ర, నాగసాధు పాత్రల గురించి చెప్పినప్పుడు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నానని అనిపించింది. వెంటనే పాత్రకు తగ్గట్టుగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్నాను. హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. డాన్స్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాను. పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను.
→ ఇందులో నాగసాధు పాత్ర మేకప్ కి ఆరు గంటల సమయం పట్టేది. తీవ్రమైన చలికాలంలో షూటింగ్ చేశాం. ఒక సన్నివేశంలో పాత్ర ప్రకారం శరీరంపై ఏమీ ఉండకూడదు. ఒక యాక్షన్ సీన్ చేస్తున్నపుడు చలికి నా శరీరం పూర్తిగా ఫ్రీజ్ అయిపోయింది. వెంటనే నన్ను కారవాన్‌కు తీసుకెళ్లి మేకప్ తొలగించి, అపోలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన తర్వాత అంతా నార్మల్‌గా ఉందని చెప్పారు. మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లిపోయాను.
→ ఈ సినిమాలోని రుద్ర పాత్ర కోసం 20 కిలోల బరువు పెరిగాను. తర్వాత నాగసాధువుగా కనిపించడానికి మరో ఐదు కిలోలు తగ్గాను. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాను. షూటింగ్ సమయంలో ప్రతిరోజూ ఒక శివాలయానికి వెళ్లి అభిషేకం చేసేవాడిని. షూటింగ్ పూర్తయ్యాక శివమాల కూడా ధరించాను. ఆ ప్రయాణంలో ఎన్నో శివాలయాలు సందర్శించాను.
→ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పాత్ర కోసం నా వైపు నుంచి 100 శాతం కష్టపడ్డాను. ఈ సినిమాలో ఒక్క యాక్షన్ సీన్‌కూ డూప్ ఉపయోగించలేదు. అన్ని యాక్షన్ సన్నివేశాలు నేనే స్వయంగా చేశాను.
→ నభా నటేష్ పాత్రకి ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో కొన్ని సస్పెన్స్‌లు ఉన్నాయి. అవి మీరు తెరపై చూసినప్పుడే తెలుస్తాయి. ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. పాటలు విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఉంటాయి.
→ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పటివరకు చూసిన వారందరూ చాలా మంచి రిపోర్ట్ ఇస్తున్నారు. అభిషేక్ నామాకి మాస్ పల్స్ బాగా తెలుసు. ఆయన తీసిన ప్రతి సన్నివేశం నాకు గూస్‌బంప్స్ కలిగించింది. ప్రేక్షకులు కూడా థియేటర్లలో విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఎంజాయ్ చేస్తారు.
→ ఇకపై సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను. త్వరలోనే కొత్త సినిమాలు ప్రకటిస్తాను.


