చాన్నాళ్ల తర్వాత ఫ్యాన్స్‌ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను : విజయ్‌ దేవరకొండ | Vijy Devarakonda Talk About Kingdom Movie | Sakshi
Sakshi News home page

‘కింగ్డమ్‌’ పార్ట్‌ 2 అద్భుతంగా ఉండబోతుంది: విజయ్‌ దేవరకొండ

Aug 2 2025 5:48 PM | Updated on Aug 2 2025 7:46 PM

Vijy Devarakonda Talk About Kingdom Movie

పదేళ్ల క్రితం నేను ఎవరనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ స్తాయిలో ఉన్నాను. అదే నాకు గొప్ప విషయం. ఇన్ని కోట్ల మందిలో ఈ అవకాశం నాకు మాత్రమే దొరికింది. అది చాలు. ఈ స్థాయికి వచ్చినందుకు ఏదో ఒకటి చేయకపోతే అర్థం ఉండదు. అందుకే అర్జున్‌ రెడ్డికి వచ్చిన బెస్ట్‌ యాక్టర్‌ అవార్డుని వేలానికి వేసి ఓ మంచి పనికి ఉపయోగించాను. నెగెటివిటీని నేను పట్టించుకోను. నా చుట్టు ఉన్నవారితో పాటు అభిమానుల్లోనూ పాజిటివిటీ నింపాడానికే ప్రయత్నిస్తాను’ అన్నారు హీరో విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్‌’ జులై 31న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మీడియాతో ముచ్చటించారు. విశేషాలు..

కింగ్డమ్సినిమాకు వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మలయాళంలో ఈ స్థాయి స్పందన ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా.. అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమ చూపించడం చాలా ఆనందంగా ఉంది.

ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై కురిపిస్తున్న ప్రేమనే నా దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్. వాళ్ళకి సినిమా నచ్చడం ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. చాలా రోజుల తరువాత అభిమానుల కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. మొదటి షో పూర్తవ్వగానే చాలామంది ఫోన్లు చేసి 'మనం హిట్ కొట్టినం' అని చెప్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది.

కెరీర్ ప్రారంభంలో సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ ఉంటుంది. పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు.. ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ, ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. కింగ్డమ్ విడుదలకు ముందు మాక్కూడా ఆలాంటి ఒత్తిడి ఉంది. ఎప్పుడైతే మొదటి షో పూర్తయ్యి, పాజిటివ్ వచ్చిందో.. అప్పుడు చాలా సంతోషం కలిగింది.

గౌతమ్(దర్శకుడు) కుటుంబ బంధాలను, ఎమోషన్స్ ని డీల్ చేసే విధానం నాకు ఇష్టం. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామా అనే ఐడియా గౌతమ్ చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. జెర్సీ లాంటి ఎమోషనల్ జర్నీలో కూడా మనకు హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి. గౌతమ్ కి ప్రతి విషయం మీద పట్టు ఉంటుంది. హీరో పాత్ర, షాట్ కంపోజిషన్, మ్యూజిక్ ఇలా ప్రతిదాని మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. కింగ్‌డమ్ కోసం ఆసక్తికర కథనం రాశాడు. ఇందులో ఏదో యాక్షన్ సన్నివేశం పెట్టాలి కదా అన్నట్టుగా ఎక్కడా పెట్టలేదు. దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉండేలా చూసుకున్నాడు.

ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ప్రధానంగా కథ ఉంటుంది. కానీ, ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశముంది. అలాగే, ఒక తెగకు చెందిన నాయకుడి గురించి ఉంటుంది. ఇలా ఇన్ని అంశాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యంకాదు. అందుకే రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాము. తన అన్నయ్య శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని మొదటి భాగంలో చూశాం. రెండవ భాగానికి సంబంధించి గౌతమ్ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంగా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది.

ఈ కథ విన్న తర్వాత అసలు ఆ కాలంలో ఎలా మాట్లాడేవారు, ఎలాంటి దుస్తులు వేసుకునేవారు వంటి విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాను. రిఫరెన్స్ కోసం పలు వెబ్ సిరీస్ లు చూశాను. అలాగే లుక్ పరంగానూ మరింత దృఢంగా కనిపించే ప్రయత్నం చేశాను. ఒక నటుడిగా ఎప్పుడూ ఫిట్ గా ఉండటానికి ఇష్టపడతాను. అయితే ఇందులో అన్నయ్యని తిరిగి తీసుకురావడం కోసం ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే సమయంలో బల్క్ గా కనిపించాలనే ఉద్దేశంతో దాదాపు ఆరు నెలలు ప్రత్యేక కసరత్తులు చేశాను.

నా తదుపరి సినిమాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్నాను. నా సినీ జీవితంలో మొదటిసారి రాయలసీమ నేపథ్యంలో చేస్తున్న చిత్రమిది. నాకు సీమ యాస అంటే చాలా ఇష్టం. అనంతరం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాను. ఆంధ్రా నేపథ్యంలో సరికొత్త కథతో ఆ చిత్రం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement