స్క్రిప్ట్‌ చదివే నిర్మాతలు ఇద్దరే! | Sakshi
Sakshi News home page

స్క్రిప్ట్‌ చదివే నిర్మాతలు ఇద్దరే!

Published Thu, Jan 14 2021 6:35 AM

Trivikram Srinivas At RED Movie Pre Release Event - Sakshi

‘స్రవంతి’ రవికిశోర్‌గారికి నేను చాలా రుణపడి ఉంటాను. స్క్రిప్ట్‌ను మొదటి సీన్‌ నుండి చివరి సీన్‌ వరకూ చదివే నిర్మాతలు ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు రామానాయుడుగారు, మరొకరు రవికిశోర్‌గారు. నా కెరీర్‌ మొదట్లోనే నాలుగు సినిమాలు రవికిశోర్‌గారితో పనిచేసే అదృష్టం నాకు దక్కింది’’ అంటూ రవికిశోర్‌కి పాదాభివందనం చేశారు దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రామ్‌ హీరోగా ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన ‘రెడ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘రామ్‌ను ‘దేవదాస్‌’ సినిమాలో చూసినప్పుడు రవికిశోర్‌గారితో మెరుపుతీగలా ఉన్నాడు అన్నాను.

చూసినంత సులువు కాదు.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లాంటి సినిమాలో నటించటం’’ అన్నారు. రామ్‌ మాట్లాడుతూ– ‘‘మా పెదనాన్నగారితో చాలా సినిమాలు చేశాను. కానీ స్టేజ్‌ మీద ఎప్పుడూ ఆయన గురించి మాట్లాడలేదు. నా దృష్టిలో ‘రెడ్‌’ సినిమాకి రియల్‌ హీరో పెదనాన్న రవికిశోర్‌గారు. ఈ సినిమాని చంటిబిడ్డలా కాపాడుతూ వచ్చారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రవికిశోర్‌గారికి, మంచి విజువల్స్‌ ఇచ్చిన సమీర్‌రెడ్డి గారికి థ్యాంక్స్‌’’ అన్నారు కిశోర్‌ తిరుమల. ఈ కార్యక్రమంలో మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఏయస్‌ ప్రకాశ్, ఎడిటర్‌ జునైద్‌ తదితరులు పాల్గొన్నారు.

రవికిశోర్‌కి పాదాభివందనం చేస్తున్న త్రివిక్రమ్‌

Advertisement
Advertisement