ఈ రోజుల్లో కంటెంట్ కింగ్ అనే మాట అక్షరాల నిజమవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్దపెద్ద స్టార్స్ ఉంటేనే మార్కెట్ ఉంటుందనే భ్రమలోనుంచి బయటికి రావాల్సిందే. చిన్న సినిమా అయినా సరే.. జనాలకు కనెక్ట్ అయితే కాసుల వర్షం కురిపించడం ఖాయమే. అదే నిజం చేస్తోంది ఇటీవలే విడుదలైన తెలుగు సినిమా. అదేనండి రూరల్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి.
ఈనెల 21న థియేటర్లలోకి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా దూసుకెళ్తోంది. సినిమా రిలీజ్కు ముందే తన కథపై నమ్మకంతో డైరెక్టర్ ఛాలెంజ్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. మొదటి రోజే ఈ మూవీకి దాదాపు కోటిన్నర కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్ కలిసి రావడంతో కేవలం మూడు రోజుల్లోనే రూ.7.28 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఒక్క నైజాంలోనే రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కేవలం మౌత్టాక్తోనే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా.. ఈ మూవీలో తేజస్వి రావు, అఖిల్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతు సాయిలు కాంపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు.
ఈ మూవీ కథేంటంటే..
'రాజు వెడ్స్ రాంబాయి' విషయానికొస్తే.. 2010లో ఖమ్మం దగ్గర ఓ పల్లెటూరిలో జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) పెళ్లిళ్లకు బ్యాండ్ కొడుతుంటాడు. అదే ఊరిలో ఉండే రాంబాయిని(తేజస్వి రావు)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా రాజు ప్రేమలో పడిపోతుంది. కానీ తనకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలనేది రాంబాయి తండ్రి వెంకన్న(చెతన్య జొన్నలగడ్డ) పట్టుదల. ఇంతలోనే రాజు-రాంబాయి ప్రేమ విషయం ఊరంతా తెలిసిపోతుంది. దీంతో వీళ్లిద్దరూ ఊరి వదిలి పారిపోవాలనుకుంటారు. తర్వాత ఏమైంది? చివరకు ప్రేమలో విజయం సాధించారా లేదా అనేదే మిగతా స్టోరీ.


