
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి షూటింగ్లు జరపొద్దని నిర్ణయించింది. ఎలాంటి సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్ల ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిల్మ్ ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది. వారితో ఎలాంటి చర్చలు, సంప్రదింపులు చేయకుండా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలని సూచించింది.
అంతేకాకుండా స్టూడియోలు, ఔట్‌డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుమతి లేకుండా ఎలాంటి సేవలూ అందించకూడదని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది.