Director K Viswanath Death: కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్‌ ఇకలేరు

Tollywood Director K Viswanath Passed Away - Sakshi

విశ్వ విఖ్యాతి తెచ్చిన ‘శంకరాభరణం’ విడుదల రోజే కన్నుమూత

ఆస్పత్రి నుంచి ఫిలింనగర్‌లోని స్వగృహానికి భౌతికకాయం తరలింపు

సినీ, రాజకీయరంగ ప్రముఖుల దిగ్భ్రాంతి

సాక్షి, హైదరాబాద్‌: ఓ శంకరాభరణం, ఓ సిరిసిరి మువ్వ, ఓ సిరివెన్నెల, ఓ స్వాతి ముత్యం, ఓ శుభసంకల్పం.. తెలుగు సినీరంగానికి ఇలాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలనిచ్చిన  దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, కళా తపస్వి కె.విశ్వనాథ్‌గా ప్రఖ్యాతిగాంచిన కాశీనాథుని విశ్వనాథ్‌ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. వయోభారం వల్ల ఆయన ఈ మధ్య కాలంలో పలుమార్లు ఆస్పత్రిలో చేరినా కోలుకుని తిరిగి వచ్చారు. అయితే రెండురోజుల క్రితం ఆయన తిరిగి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఎప్పటిలాగే తిరిగొస్తారని కుటుంబసభ్యులు, అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందినవారు ఆశించారు. కానీ ఆయన ఇక సెలవంటూ వెళ్లిపోయారు.

రాత్రి 12 గంటల ప్రాంతంలో విశ్వనాథ్‌ భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపులిపర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్‌ ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయనకు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన శంకరాభరణం సినిమా విడుదల రోజైన ఫిబ్రవరి 2వ తేదీనే కె.విశ్వనాథ్‌ కన్ను మూయడం విశేషం. 1930 ఫిబ్రవరి 19న జని్మంచిన విశ్వనాథ్‌..51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  

వాహినీ పిక్చర్స్‌ జీఎంగా మొదలుపెట్టి.. 
కాశీనాథుని సుబ్రమణ్యం, సరస్వతమ్మ దంపతులకు కె. విశ్వనాథ్‌ జన్మించారు. ప్రాథమిక విద్య గుంటూరు జిల్లాలోనే సాగినా ఆ తర్వాత ఆయన కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. అయితే కాలేజీ చదువు మాత్రం గుంటూరులో సాగింది. బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి ఆరంభించిన వాహినీ పిక్చర్స్‌లో విజయవాడ బ్రాంచ్‌కి జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారు. బీఎస్సీ పూర్తి చేశాక చెన్నై వాహినీ స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా కెరీర్‌ ఆరంభించారు. అన్నపూర్ణ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ‘తోడికోడళ్ళు’ సినిమాకు పనిచేస్తున్నపుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆదుర్తి దర్శకత్వంలో ‘ఇద్దరు మిత్రులు’, ‘డాక్టర్‌ చక్రవర్తి’ వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. కె. విశ్వనాథ్‌ ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తన సంస్థ నిర్మించిన ‘ఆత్మ గౌరవం’ (1965) సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. ‘సిరిసిరిమువ్వ’ సినిమాతో కె. విశ్వనాథ్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది.

అప్పటినుంచి చివరి సినిమా ‘శుభప్రదం’ (2016) వరకూ విశ్వనాథ్‌  51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో 41 తెలుగు కాగా 10 హిందీ. సాగరసంగమం, శ్రుతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వయంకృషి తదితర అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. విశ్వనాథ్‌ చిత్రాలన్నీ సంగీత ప్రాధాన్యంగా సాగడం ఓ విశేషం. నటుడిగానూ వెండితెరపై తనదైన ముద్రవేశారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, సీతారామయ్యగారి మనవరాలు, ఠాగూర్, అతడు, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ తదితర చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ఏ సినిమా తీసినా అది ఆరంభించి, ముగించేవరకూ షూటింగ్‌కి ఖాకీ బట్టలు ధరించడం విశ్వనాథ్‌ అలవాటు. తనను తాను కారి్మకుడిలా భావిస్తానని, అందుకే ఖాకీ తొడుక్కుంటానని పలు సందర్భాల్లో విశ్వనాథ్‌ పేర్కొన్నారు. తాను దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్‌ చేశారు. వాటిలో సరగమ్‌ (సిరిసిరిమువ్వ), సుర్‌సంగమ్‌ (శంకరాభరణం), కామ్‌చోర్‌ (శుభోదయం), శుభ్‌కామ్నా (శుభలేఖ), సమ్‌జోగ్‌ (జీవనజ్యోతి) ఉన్నాయి.  

ఐదు జాతీయ అవార్డులు 
విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. ‘స్వాతిముత్యం’ సినిమా 1986లో ఆస్కార్‌ అవార్డుల నామినేషన్లకు అధికారిక ప్రవేశం పొందింది. మొత్తం ఐదు జాతీయ అవార్డులు లభించాయి. భారతీయ సినిమాకు చేసిన సేవకు గాను విశ్వనాథ్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కేతో పాటు ఐదు నంది అవార్డులు, 10 ఫిలింఫేర్‌ అవార్డులు, ‘సాక్షి’ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా అందుకున్నారు.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top