Tollywood And Bollywood Celebrities Side Business Details in Telugu - Sakshi
Sakshi News home page

ఈ స్టార్ హీరోహీరోయిన్ల సైడ్ బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కోట్లల్లో లాభాలు!

Published Sun, Jul 2 2023 10:26 AM

Tollywood And Bollywood Celebrity Side Business Details - Sakshi

జీవిక కోసం వృత్తిని.. మానసిక ఉల్లాసం కోసం ప్రవృత్తిని సాగించడం సాధారణమే! కానీ ప్రవృత్తినే వృత్తిగా చేపట్టి.. ఆర్థిక భద్రత కోసమో లేక తమలోని వ్యూహ దక్షతను చాటుకోవడానికో వ్యాపారంలోకి దిగడం కొంచెం విశేషమే! ఆ ‘విశేషం’గా చెప్పకోదగ్గవాళ్లలో చాలామంది సామాన్యులు.. కొంతమంది సినీకళాకారులూ ఉన్నారు. అలాంటి సామాన్యులు ఇంకెంతోమంది సామాన్యులకు స్ఫూర్తి! సెలబ్రిటీల పాపులారిటీ.. వాళ్ల సొంత విషయాల పట్ల ప్రేక్షకులకున్న కుతూహలం దృష్ట్యా వాళ్ల వ్యాపారాల పరిచయం...!

కొలువున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనేది పాత తరం తీసుకున్న జాగ్రత్త. కెరీర్‌ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు పొదుపు చేసుకోవడమే కాదు నాలుగు వ్యాపారాల్లో మదుపూ చేయడం నేటి తరం వేస్తున్న తెలివైన అడుగు. ఇదివరకటిలా సర్కారు ఉద్యోగాలు కావు.. రిటైర్మెంట్‌ భద్రత లేదు. అంతదాకా ఎందుకు రిటైర్‌ అయ్యే వరకు ఒకటే కొలువులో కొనసాగే పరిస్థితీ లేదు. అందుకే కెరీర్‌ ఊపులో ఉన్నప్పుడే నాలుగు దారులు చూసిపెట్టుకోవాల్సిన స్థితి. మిగిలిన ఉద్యోగాల సంగతి ఎలా ఉన్నా క్రియేటివ్, గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉన్న వాళ్లకు మాత్రం ఈ ముందుచూపు తప్పనిసరైంది. ముఖ్యంగా సినిమా రంగం.

మునుపటిలా నటీనటులు, టెక్నీషియన్స్‌ నిర్మాణ సంస్థల ఉద్యోగులుగా ఉండట్లేదు. అప్పటిలా ఇప్పుడు ఒకొక్కరు ఏళ్ల తరబడి వెండితెరను ఏలడంలేదు. ఇప్పుడు కెరీర్‌ నిలకడగా లేకపోయినా, పలు వేదికల మీద అవకాశాలకైతే కొదవ లేదు. నిన్న, మొన్నటి తరాలకు నిలకడ ఉన్నా, నేటితో పోల్చుకుంటే పారితోషికాలు తక్కువే! ఆ సంపాదనను జాగ్రత్తగా వాడుకున్న వాళ్లు ఎంతమందో.. లెక్కలేకుండా దానధర్మాలు చేసి చివరి దశలో కష్టాలపాలైన వాళ్లూ అంతేమంది. వాటన్నింటినీ పాఠాలుగా తీసుకుంది నేటి తరం. పది సినిమాల తోనే వెండితెర అవకాశాలకు ఎండ్‌ పడినా.. ఆ పదికే పారితోషికం కోట్లలో అందుతోంది. దాన్నే పెట్టుబడిగా మలచుకుని వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. లేదంటే బాగా నడుస్తున్న వ్యాపారాల్లో భాగస్వాములవుతున్నారు. అలాగని నటనా తృష్ణకు ఫుల్‌స్టాప్‌ ఏం పెట్టట్లేదు. నచ్చిన స్క్రిప్ట్‌ వస్తే సినిమా సైన్‌ చేస్తున్నారు. ఇతర వేదికల మీది అవకాశాలనూ అందుకుంటూ నటనా తృష్ణను తీర్చుకుంటున్నారు.

కేవలం సినిమాలు చేస్తూనే వ్యాపారాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ.. సత్తా చాటుతున్నవారూ ఉన్నారు. తెర మీద నటనతో ప్రేక్షకులను అలరిస్తూ.. వ్యవసాయంతో తమను అలరింపచేసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. మరి ఎవరెవరు ఏమేం చేస్తున్నారో తెలుసుకుందాం.. సరదాగా..

రామ్‌ చరణ్‌..
ఒక విజయవంతమైన వ్యాపారవేత్త! గుర్రాలు, వాహనాలను అమితంగా ఇష్టపడే చరణ్‌కి ‘హైదరాబాద్‌ పోలో క్లబ్‌ అండ్‌ రైడింగ్‌ క్లబ్‌’, ‘ట్రూజెట్‌’ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఉన్నాయి. ఓవైపు నటుడిగా రాణిస్తూనే.. మరోవైపు ‘కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ’, స్నేహితుడు విక్రమ్‌ రెడ్డితో కలసి ‘వి మెగా పిక్చర్స్‌’ను స్థాపించి నిర్మాతగానూ విజయం సాధిస్తున్నాడు.

అల్లు అర్జున్‌.. కూడా మంచి వ్యాపారవేత్త. హైదరాబాదులోని ‘బఫెలో వైల్డ్‌ వింగ్స్‌’, ‘బి–డుబ్స్‌’ రెస్టారెంట్స్‌తో ప్రారంభమైన తన వ్యాపార సామ్రాజ్యం, అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. ప్రముఖ ‘ఎమ్‌. కిచెన్‌’తో అనుసంధానమై ‘800 జూబ్లీ’ పేరుతో మరో నైట్‌ క్లబ్‌ కూడా ఉంది. ఈ మధ్యనే ఏషియన్‌ సినిమాస్‌తో చేతులు కలిపి ‘ఏఏఏ సినిమాస్‌’ అనే మల్టీప్లెక్స్‌నూ ప్రారంభించాడు.

విజయ్‌ దేవరకొండ.. ప్రేక్షకుల్లో తనంటే ఉన్న క్రేజీనెస్‌నే పెట్టుబడిగా పెట్టి ‘రౌడీ’ పేరుతో సొంత బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడది ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్‌ ‘మింత్రా’తో అనుసంధానమై దేశవ్యాప్తంగా విస్తరించింది. దుస్తులతోపాటు, కాఫీ మగ్గులు, మల్టులు, ఫుట్‌ వేర్‌ కూడా ఇందులో లభిస్తాయి. మహబూబ్‌నగర్‌లో విజయ్‌కి ‘ఏవీడీ సినిమాస్‌’ మల్టీప్లెక్స్‌ కూడా ఉంది.

మహేశ్‌ బాబు.. ‘జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌’ అనే నిర్మాణ సంస్థతో పాటు ‘ఏఎమ్‌బీ సినిమాస్‌’ పేరుతో ఒక మల్టీప్లెక్స్‌నూ ప్రారంభించాడు. హైదరాబాద్‌లోని అతిపెద్ద మాల్స్‌లో ఇదీ ఒకటి.

పెద్ద హీరోలు కూడా..
యువతరమే కాదు.. సీనియర్‌ హీరోలూ బిజినెస్‌లో బాబులే. ఇంకా చెప్పాలంటే కుర్ర హీరోలకు స్ఫూర్తిదాతలు. టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జునకు ‘ఎన్‌గ్రిల్స్‌’ రెస్టారెంట్‌. ‘ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’ ఉన్నాయి. మెగాస్టార్‌ చిరంజీవికి ‘కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ’లో వాటాలు ఉన్నాయి. అలాగే విలన్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన జగపతిబాబుకు ఒక ఫర్నిచర్‌ బిజినెస్, మోహన్‌బాబుకు సొంత ప్రొడక్షన్‌ హౌస్‌తో పాటు ‘శ్రీ విద్యానికేతన్‌’ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్‌కు ‘లైఫ్‌ అట్‌ ప్రకాశం’ రిసార్టు ఉంది. అలాగే సందీప్‌ కిషన్‌కి ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్‌ ఉంది.

పరభాషా తారలేం తక్కువ కాదు తెలుగు హీరోల్లోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ హీరోలదీ ఇదే బాట. జీన్స్‌ సినిమాతో ఫేమస్‌ అయిన ప్రశాంత్‌.. తమిళనాడులోనే అతిపెద్ద జ్యూలరీ మాల్‌ యజమాని. ‘రియల్‌ గోల్డ్‌ టవర్‌’ గా పిలిచే పది అంతస్తుల ఈ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో విలాసవంతమైన ఫుడ్‌ కోర్ట్‌ కూడా ఉంది. ‘నేనే అంబానీ’ ఆర్యకు చెన్నైలో ‘సీ షెల్‌’ రెస్టారెంట్, ‘ది షో పీపుల్‌’ నిర్మాణ సంస్థ ఉన్నాయి. హీరో జీవా కూడా ఈ మధ్యనే ‘ఫైడింగ్‌ రూమీ’ పేరుతో ఒక రూఫ్‌టాప్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.

టాలీవుడ్‌ హీరోయిన్స్‌..
సమంత.. ఈ స్టైల్‌ క్వీన్‌ ఏ వేడుకకు హాజరైనా అక్కడకి వచ్చినవారి చూపులన్నీ ఆమె ఆహార్యంపైనే ఉంటాయి. ఫ్యాషన్‌ను అంతగా ప్రేమించే సమంత స్వయంగా ‘సాకీ’ పేరుతో ఒక ఫ్యాషన్‌ లేబుల్‌ని ప్రారంభించింది. చెన్నైలో ‘ఏకమ్‌ ఎర్నీ లెర్నింగ్‌ సెంటర్‌’ పేరుతో కొన్ని విద్యాసంస్థలనూ నిర్వహిస్తోంది.

కాజల్‌ అగర్వాల్‌.. తన చెల్లితో కలసి ‘మర్సాలా’ జ్యూలరీ బ్రాండ్, భర్తతో కలసి హోమ్‌ డెకర్‌ లేబుల్‌ ‘కిచడ్‌’ను ప్రారంభించి రెండు చేతులా సంపాదిస్తోంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఫిట్‌నెస్‌ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండే ఈ నటి ‘ఎఫ్‌45’ ఫిట్నెస్‌ హెల్త్‌ హబ్‌, జిమ్‌ సెంటర్‌నూ ప్రారంభించింది. ఈ జిమ్‌కి చెందిన మూడు బ్రాంచీల్లో రెండు హైదరాబాదులోని గచ్చిబౌలి, కోకాపేట్‌లో ఉండగా మరొకటి విశాఖపట్నంలో ఉంది.

తమన్నా.. పదిహేనేళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్‌.. బిజినెస్‌ ఉమన్‌గానూ సక్సెస్‌ సాధించింది. 2015లో ‘వైట్‌ అండ్‌ గోల్డ్‌’ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం మొదలుపెట్టి దిగ్విజయంగా సాగిపోతోంది.

కీర్తి సురేష్‌..భూమిత్ర’ పేరుతో స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ స్థాపించింది. ఇది సహజసిద్ధ ఔషధాలతో తయారైన స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను అందిస్తోంది.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకునే మరికొంతమంది హీరోయిన్స్‌ ఉన్నారు. తాప్సీ.. చెల్లి షాగన్, స్నేహితురాలు ఫరా పర్వరేష్‌తో కలసి ‘ది వెడ్డింగ్‌ ఫ్యాక్టరీ’ పేరుతో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని ప్రారంభించి, ఎంతోమంది సెలబ్రిటీలకు పెళ్లి చేసింది. శ్రియా శరణ్‌కు ‘శ్రీ స్పందన’ బ్యూటీ సెలూన్, స్పాలు ఉన్నాయి. ఇలియానా.. గోవాలో రెస్టారెంట్లు, బేకరీలు రన్‌ చేస్తూ సక్సస్‌ఫుల్‌గా సాగుతోంది. ప్రణీత సుభాష్, నిక్కీ గాల్రానీ.. ఈ ఇద్దరికీ బెంగళూరులో వేర్వేరు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక నయనతార, త్రిష, నమిత, అనుష్కలు పలు ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ వాటాలు పెట్టి తమ సంపాదనను మరిన్ని రెట్లు పెంచుకుంటున్నారు.

బాలీవుడ్‌ హీరోయిన్స్‌..
దీపికా పదుకోణ్‌.. బాలీవుడ్‌లోనే కాదు అటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న ఆమె 2015లో.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌ మింత్రాతో కలసి సొంత ఫ్యాషన్‌ లేబుల్‌ ‘ఆల్‌ ఎబౌట్‌ యు’ను ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ ఎత్నిక్, వెస్టర్న్‌ వేర్‌ దుస్తులు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘కేఏ ఎంటర్‌ ప్రైజెస్‌’ అనే నిర్మాణ సంస్థనూ స్థాపించి.. నిర్మాతగానూ సక్సెస్‌ అయింది.

అనుష్క శర్మ.. 2017లో ‘నుష్‌’ పేరుతో ఒక ఫ్యాషన్‌ లేబుల్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ జాకెట్స్, డెనిమ్స్‌ వంటి వెస్టర్న్‌వేర్‌కి అమ్మాయిల్లో మంచి గుర్తింపు ఉంది. సొంతంగా ‘క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌’ పేరుతో చిత్ర నిర్మాణమూ చేపట్టింది.

ప్రియాంకా చోప్రా.. బాలీవుడ్, హాలీవుడ్‌లోనే కాదు వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతోంది. న్యూయార్క్‌లో ‘సోనా ఇన్‌ న్యూయార్క్‌’ రెస్టారెంట్‌ను తెరచి లాభాలు గడిస్తోంది. సొంత హెయిర్‌ కేర్‌ బ్రాండ్‌ ‘అనామోలీ’, ప్రొడక్షన్‌ హౌస్‌ ‘పర్పుల్‌ పెబల్‌’ కూడా లాభాల్లో ఉన్నాయి.

ప్రీతీ జింటా.. ‘కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ’ ఐపీఎల్‌ జట్టుకి ఓనర్‌. సౌత్‌ ఆఫిక్రాకు చెందిన ‘స్టెలెన్‌బాష్‌ కింగ్స్‌ టీమ్‌’కి కూడా ఆమే యజమాని. వీటితోపాటు ముంబైలో రెండు రెస్టారెంట్లు, ‘పీఎన్‌జడ్‌ఎన్‌’ పేరుతో ఒక నిర్మాణ సంస్థా ఉన్నాయి.

సుస్మితా సేన్‌.. సినిమాల్లోనే కాదు, వ్యాపార రంగంలోనూ దిట్టే. ముంబైలో ‘బెంగాలీ మాసీస్‌ కిచెన్‌’ రెస్టారెంట్, ‘సేన్‌సాజీవన్‌’ స్పాలను తెరచి లాభాలను అందుకుంటోంది. సొంత నిర్మాణ సంస్థ ‘తంత్ర ఎంటర్‌టైన్‌మెంట్‌’కూ మంచి పేరే ఉంది.

సోనమ్‌ కపూర్‌.. చిత్రచిత్రమైన ఫ్యాషన్‌ వస్త్రాలతో షాకింగ్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె అదే స్టైల్‌తో 2017లో ‘సోనమ్‌ రేసన్‌ లేబుల్‌’ను స్థాపించింది. అన్ని రకాల శరీరాకృతుల వారినీ ఫ్యాషన్‌ ఐకాన్స్‌గా చూపించాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్‌ రూపుదిద్దుకుంది. ఇండో వెస్టర్న్‌ అవుట్‌ఫిట్‌కి ఈ లేబుల్‌ పెట్టింది పేరు. ట్వింకిల్‌ ఖన్నా.. తన తల్లి పేరుతో ‘డింపుల్‌ కపాడియా’ అనే కొవ్వొత్తుల కంపెనీతో పాటు, ముంబైలోని ‘ది వైట్‌ విండో’ అనే ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కంపెనీని నడుపుతోంది. ‘గ్రేజింగ్‌ గోట్‌ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థనూ స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించింది.

ఆశా భోంస్లే.. 2012లో.. దుబాయ్‌లో ‘ఆశాస్‌’ పేరుతో ఒక రెస్టారెంట్‌ని ప్రారంభించింది. ఇదిప్పుడు ఆరు దేశాల్లో ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌గా పేరు పొందింది. దేశీ, పాశ్యాత్యా వంటకాలను అందించడం ఈ రెస్టారెంట్‌ ప్రత్యేకత. శిల్పా శెట్టి.. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉండి.. బిజినెస్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఒక యోగా స్టూడియో తెరచింది. ఈ మధ్యనే ‘రాయల్టీ క్లబ్‌’ పేరుతో విలాసవంతమైన రెస్టారెంట్, ‘ఎన్‌ఎస్‌’ పేరుతో ఫ్యాషన్‌ లేబుల్‌నూ ప్రారంభించింది.

లారా దత్తా.. నటిగా కంటే ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపు పొందింది. ‘భీగీ బసంతి’ పేరుతో సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ని ప్రారంభించి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించింది. ఈ మధ్యనే ‘డీవీడీ’ పేరుతో ఒక జిమ్, ‘ఛబ్రా 555’ అనే శారీస్‌ షోరూమ్‌ను తెరచింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా సుపరిచితమైన నటి కృతి సనన్‌ ‘టేకినిక్‌’ పేరుతో ఓ ఫ్యాషన్‌ లేబుల్‌ను ప్రారంభించింది. అలాగే శ్రద్ధా కపూర్‌కి ‘ఇమారా’ లేబుల్‌ ఉంది.

బాలీవుడ్‌ తారలైన మలైకా అరోరా, బిపాసా బసు, సుసానే ఖాన్‌.. ఈ ముగ్గురూ కలసి ‘ది లేబుల్‌ ఆఫ్‌ లైఫ్‌’ పేరిట ఒక క్లాతింగ్‌ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ని ప్రారంభించారు. నటి కరిష్మా కపూర్‌ ‘బేబీ ఓఈ.కామ్‌’ అనే ఈ కామర్స్‌ పోర్టల్‌కి ఓనర్‌. ఈ వెబ్‌సైట్‌లో చిన్నపిల్లలు, తల్లులకు అవసరమైన వస్తువులు లభిస్తాయి. ఇదేవిధంగా నటి సన్నీ లియోనీకి ‘ఐఎమ్‌బేషరమ్‌. కామ్‌’ అనే ఆన్‌లైన్‌ అడల్ట్‌ స్టోర్‌ ఉంది. ఇక్కడ అడల్ట్‌ టాయ్స్, దుస్తులు లభిస్తాయి.

బాలీవుడ్‌ హీరోస్‌..
షారుఖ్‌ ఖాన్‌.. క్రీడా రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాడు. 2008 ఐపీఎల్‌లో ‘కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌’ క్రికెట్‌ టీమ్‌ని కొనుగోలు చేసి మంచి లాభాలనే పొందాడు. సొంత నిర్మాణ సంస్థ ‘రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ పేరుతో ఎన్నో సినిమాలనూ నిర్మించాడు. ఇందులో ప్రముఖ నటి జూహీ చావ్లాకూ భాగస్వామ్యం ఉంది.

సల్మాన్‌ ఖాన్‌.. ‘బీయింగ్‌ హ్యూమన్‌’ పేరుతో సొంత క్లాతింగ్‌ బ్రాండ్‌ ఉంది. దీనికి పలు ప్రముఖ నగరాల్లో బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్రాండ్‌ అలంకరణ వస్తువులను కూడా అందిస్తోంది. హృతిక్‌ రోషన్‌.. 2013లో ‘హెచ్‌ఆర్‌ఎక్స్‌’ అనే జిమ్‌ వేర్‌ బ్రాండ్‌ని ప్రారంభించాడు. ఇందులో జిమ్‌ వేర్‌తోపాటు జిమ్‌కి సంబంధించిన వస్తువులు, సైకిళ్లు, షోషకాహార పదార్థాలు, ఫుట్‌ వేర్‌ దొరుకుతాయి. ఈ మధ్యనే ముంబైలో ‘సెంటర్‌ కల్ట్‌’ పేరుతోనూ ఓ జిమ్‌ను తెరచాడు.

అభిషేక్‌ బచ్చన్‌.. సినిమాల్లో కంటే వ్యాపార రంగంలోనే బాగా రాణిస్తున్నాడు. పలు ప్రముఖ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, 2014 ప్రో కబడ్డీ లీగ్‌లో మొదట విజయం సాధించిన జైపూర్‌ పింక్‌ పాంథర్‌ టీమ్‌ని కొనుగోలు చేశాడు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌లోని ‘చెన్నైయిన్‌ ఎఫ్‌సీ’యజమాని కూడా. ఈ జట్టు కూడా లీగ్‌లో తొలి విజేత.

సునీల్‌ శెట్టి.. ఇతనికీ రకాల బిజినెస్‌లు ఉన్నాయి. ముంబైలో ‘మిస్చిఫ్‌ డైనింగ్‌ బార్‌’, ‘క్లబ్‌ హెచ్‌టుఓ’ రెస్టారెంట్, బార్లు ఉన్నాయి. సొంతంగా ‘పాప్‌కార్న్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ నిర్మాణ సంస్థ, ‘ఎస్‌టు రియాలిటీ’ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, ‘హకీం అలీమ్‌ సెలూన్స్‌’లలో 50శాతం వాటాలూ ఉన్నాయి.

అర్జున్‌ రామ్‌పాల్‌.. ఢిల్లీలోని అతిపెద్ద లాంజ్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ‘ఎల్‌ఏపీ’ యజమాని. పదిహేడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ రెస్టారెంట్‌లో ఫర్నిచర్‌ డిజైనింగ్‌ చేసిన డిజైనర్స్‌లో షారుఖ్‌ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌ ఒకరు. దీనితోపాటు అతనికి.. ఈవెంట్‌ మేనేజింగ్‌ కంపెనీ ‘చైసింగ్‌ గణేశ’ కూడా ఉంది.

మిథున్‌ చక్రవర్తి.. ‘ఊటీ, గోవా, ముస్సోరీ వంటి నగరాల్లోని ‘మోనార్క్‌ గ్రూప్స్‌’ హోటళ్ల యజమాని.

అజయ్‌ దేవ్‌గన్‌.. 2011లో ఒక ప్రైవేటు సంస్థతో కలసి గుజరాత్‌లోని ‘చార్‌నాకా’ అనే ఒక సోలార్‌ ప్రాజెక్ట్‌ని స్థాపించాడు. ఇప్పుడది మంచి లాభాల్లో ఉంది. వీటితోపాటు ‘అజయ్‌ దేవ్‌గన్‌ ఫిల్మ్స్‌’ ప్రొడక్షన్‌ హౌస్, వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో ఉన్నాయి.

అమితాబ్‌ బచ్చన్‌.. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ 1996లో ‘అమితాబ్‌ బచన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ పేరుతో ఒక ప్రొడక్షన్‌ హౌస్‌ని ప్రారంభించారు. కానీ, అది ఘోరమైన నష్టాలను తెచ్చిపెట్టింది.
- దీపావళి

 
Advertisement
 
Advertisement