తెరపై తెలుగుకు 95 ఏళ్ళు | Today marks 95 years since the release of Kalidas the first Telugu talkie feature film | Sakshi
Sakshi News home page

తెరపై తెలుగుకు 95 ఏళ్ళు

Oct 31 2026 9:59 PM | Updated on Oct 31 2026 11:18 PM

Today marks 95 years since the release of  Kalidas the first Telugu talkie feature film
  • ‘కాళిదాస్’ (1931)

సాధారణంగా తొలి తెలుగు టాకీ అనగానే అందరూ ‘భక్త ప్రహ్లాద’ (1932) అంటూ ఉంటారు. తొలిసారిగా తెరపై తెలుగు అందులోనే వినిపించింది అనుకుంటూ ఉంటారు. కానీ, అంతకన్నా ముందే వెండితెరపై మన తెలుగు మాటలు, పాటలు వినిపించాయి. పది రీళ్ళ పూర్తి నిడివి ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే రిలీజైన సదరు నాలుగు రీళ్ళ సినిమా ‘కాళిదాస్’. కానీ, తెరపై తెలుగు వారి ఘన వారసత్వానికి గుర్తుగా నిలిచే ఆ చిత్రాన్ని తెలుగు వాళ్ళం మన తెలుగు సినిమాల లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశాం. తమిళులు మాత్రం దాన్ని తమదిగా గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే... తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ చిత్రం ‘కాళిదాస్’ (1931). ఆ సినిమా రిలీజై ఈ 2026 అక్టోబర్ 31కి సరిగ్గా 95 వత్సరాలు. అంటే, వెండితెరపై మన తెలుగు మాట, పాటకు 95 వసంతాలు.

తొలి భారతీయ టాకీలోనూ తెలుగోడు!
 హిందీ – ఉర్దూల మిశ్రమ భాష హిందుస్తానీలో తయారై, 1931 మార్చి 14న విడుదలైన ‘ఆలమ్ ఆరా’ తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేషిర్ ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. తెలుగువారైన హెచ్.ఎం. రెడ్డి అప్పటికే ఇరానీ వద్ద పని చేస్తున్నారు. ‘ఆలమ్ ఆరా’కు సైతం దర్శకత్వ శాఖలో సహాయకుడిగా వ్యవహరించారు. తెరపై బొమ్మలు దేశీయ భాషల్లో మాట్లాడడం అదే మొదలు కాబట్టి, ఆ తొలి భారతీయ టాకీ ఘన విజయం సాధించింది.

పోర్టబుల్ ఎక్విప్‌మెంట్‌తో టాకీ ప్రదర్శన!    
అంతకు ముందు దాకా అన్నీ మూకీ చిత్రాలే గనక, చాలాభాగం థియేటర్లు కూడా మూగ సినిమాల ప్రదర్శనకు తగ్గట్టే ఉండేవి. అంతే తప్ప, వాక్చిత్రాల (టాకీల) ప్రదర్శనకు అవసరమైన సాంకేతిక సామగ్రిని సమకూర్చుకోలేదు. ఆ పరిస్థితుల్లో ఈ ‘ఆలమ్ ఆరా’ ప్రింట్, ఆ టాకీని ప్రదర్శించడానికి అవసరమైన పోర్టబుల్ టాకీ ఎక్విప్మెంట్ తీసుకొని, దక్షిణాదిలో ఊరూరా తిరగాల్సి వచ్చేది. అలా తిరుగుతూ ప్రదర్శించినది బెంగళూరుకు చెందిన ‘సెలెక్ట్ పిక్చర్స్ సర్క్యూట్’ సంస్థ.

ఆ సెలెక్ట్ పిక్చర్స్ సంస్థకు యజమాని – చిమన్లాల్ భోగీలాల్ దేశాయ్. బొంబాయికి చెందిన అన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల సినిమాల డిస్ట్రిబ్యూషన్ రైట్లూ అప్పట్లో ఆయన యాజమాన్యంలోని ఆ ‘సెలెక్ట్’ సంస్థే తీసుకొనేది. ఆ సంస్థ బొంబాయి ఖాతాదారులు – అర్దేషిర్ ఇరానీ, ఆయన సంస్థ ఇంపీరియల్.  

‘ఆలమ్ ఆరా’ డిస్ట్రిబ్యూటర్లే ‘కాళిదాస్’ నిర్మాతలు!
1929లోనే ఇరానీ పెట్టిన ‘సాగర్ ఫిల్మ్ కంపెనీ’లో కూడా చిమన్‌లాల్ భాగస్వామి. 1931 ఆగస్ట్కు వచ్చేసరికి ఆ సాగర్ సంస్థ పూర్తి యాజమాన్యం కూడా చిమన్లాల్ బృందం చేతికొచ్చింది. అంతకు ముందే పంపిణీదారుగా ‘ఆలమ్ ఆరా’ను ఊరూరా ప్రదర్శించినప్పుడు కనకవర్షం కురవడంతో, ఉత్తరాది హిందుస్తానీ భాషలోని ‘ఆలమ్ ఆరా’ లానే... నిర్మాతగా దక్షిణ భారతీయ భాషల్లో టాకీలు నిర్మించాలనే ఆలోచన చిమన్లాల్కు వచ్చింది. తమిళంలో, తెలుగులో నిడివి తక్కువుండే షార్ట్ టాకీ డ్రామాలను (లఘు టాకీ చిత్రాలను) తీయడానికి నడుం బిగించారు.  

ఇరానీ సలహా తీసుకున్నారు. బెంగళూరులోని తమ ‘సెలెక్ట్ పిక్చర్స్ సర్క్యూట్’ పక్షాన బొంబాయిలో ఈ లఘు టాకీ చిత్రాలను నిర్మించే పనిని ఇరానీకి చెందిన ‘ఇంపీరియల్ మూవీటోన్’కు అప్పగించారు. అలా రూపొందినదే – మన ఫస్ట్ సౌతిండియన్ టాకీ ‘కాళిదాస్’. సహజంగానే ఇరానీ వద్ద ‘ఆలమ్ ఆరా’కు పని చేసిన దక్షిణ భారతీయుడైన హెచ్.ఎం. రెడ్డికి దర్శకత్వం అప్పగించారు. అయితే, 1931 అక్టోబర్ 31న ‘కాళిదాస్’ను విడుదల చేసినప్పుడు మాత్రం ‘సాగర్’కు మాతృసంస్థ అయిన ‘ఇంపీరియల్ మూవీటోన్’ పతాకంపైనే రిలీజ్ చేయడం గమనార్హం.

‘సెలెక్ట్’ వారి లఘు టాకీల తొలి వార్తలు!    
దక్షిణాది భాషల్లో తొలి టాకీలు రూపొందించే పని అప్పగించబడ్డ దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి నటీనటుల ఎంపిక, వగైరా కోసం మద్రాసు వచ్చారు. అప్పటికే మద్రాసులో కొన్ని మూకీల్లో నటించిన, సుప్రసిద్ధ రంగస్థల నటి, గాయని టి.పి. రాజలక్ష్మిని హీరోయిన్‌గా ఎనుకున్నారు. టాకీల్లో నటించేందుకు ఆమె మద్రాసు పయనమయ్యారు. 
అప్పట్లోనే ‘సెలెక్ట్ పిక్చర్స్ సర్క్యూట్’ – ‘సాగర్’ సంస్థల అధినేత చిమన్లాల్ దేశాయ్ ‘తెలుగు, తమిళ టాకీలు తీస్తున్నార’నీ, వాటిలో ‘ఒకటి డ్యాన్స్ పిక్చర్’ (‘కొరత్తి సాంగ్స్ అండ్ డ్యాన్స్’ అన్నమాట) అనీ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దక్షిణ భారతదేశంలో రిలీజ్ చేసేందుకు, తమిళ, తెలుగు భాషల్లో ఇంపీరియల్ మూవీటోన్ సాయంతో ఈ టాకీ లఘు చిత్రాలను సాగర్ ఫిల్మ్ సంస్థ చకచకా నిర్మిస్తున్నట్టూ కథనాలు వెలువడ్డాయి.

‘కాళిదాస్’గా తెలుగువాడే!
కాళిదాస్ కథలో తెరపై టి.పి. రాజలక్ష్మికి జోడీగా టైటిల్ పాత్రను పోషించిన నటుడు – వి.ఆర్. గంగాధర్. ఆయన ఆ రోజుల్లోనే ‘‘బి.ఏ. చదివిన’’ ఉన్నత విద్యావంతుడు. అప్పట్లో ‘‘ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్.’’ అలా ఆ ‘కాళిదాసు’ పాత్ర వేసిన సదరు గంగాధర్ / గంగాధరరావు అచ్చ తెలుగువాడు! ‘‘...ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన ఒకరిని కాళిదాసుగా నటింపజేశారు’’ అని హీరోయిన్ రాజలక్ష్మే అప్పట్లో చెప్పారు.

 అది ఒక సినిమా కాదు! 3 చిత్రాల ‘ప్రోగ్రామ్’!    
ఆ నాలుగు రీళ్ళ ‘కాళిదాస్’ తర్వాత రూపొందినదే... తెలుగు సినీ చరిత్రలో తరచూ చెప్పుకొనే ‘భక్త ప్రహ్లాద’ 10 రీళ్ళ పూర్తి నిడివి తెలుగు టాకీ. ఆ చిత్ర ప్రదర్శనలో తెలుగు మినహా మరో భాషే వినిపించదు. కానీ, ‘కాళిదాస్’ అలా కాదు. అసలు ఆ చిత్ర ప్రదర్శనే... ఒకటి కాదు... ఒకటికి మూడు వేర్వేరు చిన్న చిన్న చిత్రాల కదంబ ప్రదర్శన. ఆ మూడింటిలో ప్రధానమైనది – తెరపై ఓ కథంటూ చెప్పే ‘కాళిదాస్’. ఆ ఫిల్ము వరకు మొత్తం తెలుగు డైలాగుల్లోనే నడిచింది. ‘కాళిదాస్’తో పాటు కలిపి ఒకటే ‘ప్రోగ్రామ్’గా ప్రదర్శించిన మిగతా రెండు లఘు చిత్రాలు మాత్రం తమిళం. అవి... తమిళ దేశభక్తి గీతాలు, తమిళ కురత్తి పాటలు – డ్యాన్సు ఉన్న చిత్రాలు.


ఆ 3 సినిమాలు ఏమిటంటే...
 ‘కాళిదాస్’ పాటల పుస్తకం ఆ ‘ప్రోగ్రామ్’ వివరాలను స్పష్టంగా పేర్కొంది. ఆ వివరాలు ఏమిటంటే...
    1). దేశభక్తి నిండిన జాతీయవాద గీతాలు (తమిళంలోవి), కీర్తనలు (తెలుగులోని త్యాగరాయ కీర్తనలు), ప్రణయ గీతాలు (తమిళంలోవి), డ్యాన్స్ చూపిన 3 రీళ్ళ చిత్రం.

    2). ‘కాళిదాస్’. ఇందులో కాళిదాస్ హాస్యఘట్టాల్లో ఒకటి, అలాగే అతని జీవితంలోని ప్రేమఘట్టం మరొకటి చూపారు. ఇది 4 రీళ్ళ చిత్రం. (ఇది పూర్తిగా తెలుగు డైలాగులతోనే తీసిన తెలుగు కథాచిత్రం).

    3). హీరోయిన్ మిస్. టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై విజయవంతంగా అభినయిస్తూ, అప్పటికే ఎంతో పేరు సంపాదించుకున్న ‘కురత్తి’ డ్యాన్స్. ఇది 2 రీళ్ళ చిత్రం. (‘కురత్తి నృత్యం’ అనేది ప్రత్యేక జానపద శైలి నృత్యం. అందులో సాధారణంగా ‘కురత్తి’, అంటే ఎరుకలసాని వచ్చి, నృత్యం చేస్తుంది. సోదె చెబుతుంది).

 ఈ 3 తక్కువ నిడివి చిత్రాల సమాహారమే ‘కాళిదాస్’ షో అన్నమాట. అన్నీ కలిపితే మొత్తం 9 రీళ్ళు.

విడివిడిగా నిడివి తక్కువ గల ఈ మూడు లఘు చిత్రాలనూ కలిపి, ‘కాళిదాస్’ అని ఒకటే పేరుతో, ఒకే టాకీ ప్రదర్శనగా రిలీజ్ చేశారు. ఒకదాని వెంట ఒకటిగా...  మూడూ కలిపి ఒకే షోగా ప్రదర్శించారు. అటు తమిళులనూ, ఇటు తెలుగువారినీ ఆకర్షించడానికి ‘‘తొలి తమిళ, తెలుగు టాకీ చిత్రం’’గా పబ్లిసిటీ చేశారు.


తొలి తమిళ టాకీ ‘హరిశ్చంద్ర’
సాగర్ మూవీటోన్ కంపెనీ వారే ఆ వెనువెంటనే తీసిన తమిళ టాకీ కథాచిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ (1932 ఏప్రిల్ 9). దాన్నే ‘‘తొలి తమిళ టాకీ’’ అని నాటి పత్రికల్లో స్పష్టంగా ప్రకటించారు. దీన్నిబట్టి కూడా ‘‘తొలి తమిళ టాకీ’’ అనే పట్టం ‘కాళిదాస్‌’ది కాదు... ఆ తర్వాత నాలుగు నెలలకు వచ్చిన ‘రాజా హరిశ్చంద్ర’ది అని అర్థమవుతుంది. అలా ఏ రకంగా చూసినా, 4 రీళ్ళ ‘కాళిదాస్’ కథాచిత్రం వరకు తమిళ టాకీ కానే కాదు. అచ్చంగా తెలుగు టాకీనే!

 అంతా తెలుగే! తమిళం, హిందీ లేవు!*
ఇవాళ చాలామంది ‘కాళిదాస్’ను తమిళ టాకీగానే పేర్కొంటున్నారు. తమిళ సినిమా లెక్కల్లోనే కలిపేస్తున్నారు. కానీ, ‘కాళిదాస్’లో అసలు తమిళ డైలాగులే లేవు! హీరో తెలుగులో మాట్లాడితే, హీరోయిన్ తమిళంలో బదులు ఇచ్చిందనీ, పూజారి పాత్ర ధరించిన ఎల్వీ ప్రసాద్ లాంటి వారు హిందీలో సంభాషణలు పలికారన్నదీ వట్టి పుక్కిటి పురాణమే! ‘కాళిదాస్’ కథాచిత్రాన్ని అచ్చంగా తెలుగు డైలాగులతోనే చిత్రీకరించారు. ఆ చిత్రంలో నటించిన టి.పి. రాజలక్ష్మి ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఎల్వీ ప్రసాద్ జ్ఞాపకాలు, అలాగే సమకాలికులైన తమిళ సినీ జర్నలిస్టులైన ‘పేసుమ్ పడమ్’ పత్రిక ఎడిటర్ టి.వి. రామనాథ్, ‘నారదర్’ పత్రిక ఎడిటర్ శ్రీనివాసరావు తదితరుల కథనాలు, ‘ఆనంద వికటన్’ పత్రికలో రచయిత ‘కల్కి’ కృష్ణమూర్తి రాయగా వచ్చిన ఆనాటి సమీక్షే అందుకు స్పష్టమైన సాక్ష్యాలు.

 ఆ సంగతి హీరోయినే చెప్పింది!
‘కాళిదాస్’ తీస్తున్నప్పుడు ‘‘నేను తమిళ, తెలుగు పాటలు పాడాను. తెలుగులో డైలాగులు చెప్పాను’’ అని ఆ సినిమా రిలీజు వేళలో హీరోయిన్ రాజలక్ష్మి స్వయంగా పేర్కొన్నారు. ‘‘తెలుగు సంభాషణలను ద్రావిడ లిపిలో (అంటే తమిళ లిపిలో అన్నమాట) రాసుకొని వల్లించాను’’ అని స్పష్టంగా చెప్పారు. వెరసి, అందరూ తెలుగులోనే మాట్లాడిన వాక్చిత్రం ‘కాళిదాస్’. అలా ఓ తెలుగు దర్శకుడు, తెలుగు హీరో, తెలుగు సహాయ నటులు నటించగా, హీరోయిన్ సైతం తెలుగులోనే డైలాగులు చెప్పగా ఓ చిన్న నిడివి తెలుగు టాకీగా ‘కాళిదాస్’ ఫీచర్ ఫిల్మ్ తయారైంది.
  
రివ్యూలోనూ తెలుగేనని రాశారు!
తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’ సైతం సినిమా రిలీజైనప్పుడు రాసిన రివ్యూలో ఆ మాట చెప్పింది. ‘‘...అందులో తమిళ మాటలు లేవు. కనుక్కుంటే, అది తెలుగు భాష అని తెలిసింది. (సినిమా ప్రదర్శన) మొదట్లో, మధ్యలో, చివరలో మాత్రం కొన్ని తమిళ పాటలు వచ్చాయి...’’ అని ఆ సమీక్ష తేల్చేసింది. అంటే, 10 రీళ్ళ పూర్తి నిడివి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే తెరపై తొలిసారిగా తెలుగు మాటలు, పాటలతో వినిపించిన 4 రీళ్ళ లఘు కథాచిత్రం ‘కాళిదాస్’.

ఇంతమంది ‘కాళిదాస్’ తీసింది తెలుగులోనే అని నిర్ద్వంద్వంగా చెప్పినా, చరిత్రలో మనం... తెలుగువాళ్ళం మాత్రం ఇవాళ్టికీ ఆ సంగతి పట్టించుకోకపోవడం విషాదం. మన తెలుగు సినీ చరిత్రను 1931 నాటి ‘కాళిదాస్’ నుంచి కాకుండా, దానికి కొద్దినెలల తర్వాతెప్పుడో వచ్చిన 1932 నాటి ‘భక్త ప్రహ్లాద’ నుంచి చెప్పుకుంటూ ఉండడం విచిత్రం. విచారకరం.  

తొలి తెలుగు పాట కీర్తన!
ఆ మూడు లఘు చిత్రాల కదంబంలోని తమిళ, తెలుగు పాటలన్నీ హీరోయిన్ రాజలక్ష్మే పాడారు. అప్పట్లో ఈ సినిమా పాటల పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించారు. దక్షిణాదిలో వచ్చిన తొలి సినిమా పాటల పుస్తకం ఇదే! అప్పటికే సుప్రసిద్ధురాలైన టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై పాడుతున్న పాపులర్ త్యాగరాయ కీర్తనలనే ఈ ‘కాళిదాస్’లోనూ ఆమెతో పాడించారు. వెండితెరపై వినిపించిన తొలి తెలుగు పాటలు ఇవే!  

తెలుగు తర్వాతే తమిళం!
‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న మద్రాసులోని ‘కినిమా సెంట్రల్’ థియేటర్ (తరువాతి రోజుల్లో శ్రీమురుగన్‌గా పేరు మార్చుకుంది)లో రిలీజైంది. మూడు లఘు చిత్రాల కదంబమైన ‘కాళిదాస్’ షోలో సాంకేతికంగా సవాలక్ష లోపాలున్నా హిట్టయింది.  

కదంబ మాలికగా వచ్చిన ‘కాళిదాస్’  విజయం అనేక విధాల కీలక పరిణామం. ఆ విజయాన్ని ప్రేరణగా తీసుకొనే... వెనువెంటనే తొలి పూర్తి నిడివి తెలుగు సినిమా (‘భక్త ప్రహ్లాద’ – 1932 ఫిబ్రవరి 6న రిలీజ్) అదే హెచ్. ఎం. రెడ్డి దర్శకత్వంలో వచ్చింది. ఆ తర్వాత తొలి తమిళ టాకీ కథాచిత్రం (‘హరిశ్చంద్ర’ – 1932 ఏప్రిల్ 9) తయారైంది.

తెరపై తొలిసారి పూర్తిగా తెలుగు డైలాగులతో, మన త్యాగరాయ కీర్తనలతో, తెలుగు హీరో, తెలుగు దర్శకుడితో తయారైన ‘కాళిదాస్’ను ఇప్పటికైనా మన సినిమాగా తెలుగు సినీచరిత్రలో గుర్తించాలి. చేతులారా వదిలేసుకుంటున్న మన తెలుగు వారి ఘన వారసత్వాన్ని మనమే నిలుపుకోవాలి. తెరపై మొదటిసారిగా మన తెలుగు మాట, పాట వినపడిన ‘కాళిదాస్’ వారసత్వాన్ని స్మరించుకుంటూ, ప్రతి అక్టోబర్ 31న మన సినిమా పరిశ్రమ పండుగ చేసుకోవాలి.  
- జయదేవ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement