
హనుమాన్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిరాయి. మంచు మనోజ్, జగపతిబాబు, శ్రియ, రితికనాయక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టంనేని తెరకెక్కించారు. ఈ నెల 12న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చైన్నెకి వెళ్లిన నటుడు తేజా సజ్జా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని చిత్రాలను మాత్రమే థియేటర్‌లో చూడాలనిపిస్తుందని, అలాంటి వాటిలో మిరాయి చేరుతుందని అన్నారు.
యాక్షన్ ఎడ్వేంచర్ ఫాంటసీ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని 3ఏళ్ల బాలల నుంచి 80 ఏళ్ల పెద్దలు వరకూ చూసి ఆనందించే విధంగా ఉంటుందన్నారు. మిరాయి అంటే భవిష్యత్, నమ్మకం అని చెప్పారు. అయితే, మరో అర్థం కూడా ఉందని అది చిత్రంలో ట్విస్ట్‌తో తెలుస్తుందని చెప్పారు. మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తాను పొందిన జ్ఞానాన్ని ఒక గ్రంధంగా రచించారు. అది ఒకే చోట ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందనే భావనతో దాన్ని 9 గ్రంధాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. వారికి ఆ గ్రంధాలను పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పుతారు. అయితే, 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ ఒక్కొటిగా తస్కరిస్తుంది. వాటిని హీరో ఎలా కాపాడే ప్రయత్నం చేశాడు..? అన్నదే చిత్ర కథ అంటూ చెప్పారు.
ఏదైనా విపత్తు వప్తే దాన్ని ఆపడానికి మన ఇతిహాసాల్లో ఒక సమాదానం ఉంటుందన్నారు. తన ధర్మాన్ని తెలుసుకుని విపత్తును ఎలా నిరోధించాడు.. అన్న పలు ఆసక్తి కరమైన అంశాలతో కూడిన మిరాయి చిత్రాన్ని చైనా, జపాన్ దేశాల్లోనూ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఎందుకంటే ఆ దేశాల్లో భారతీయ చిత్రాలకు మంచి మార్కెట్ ఉందన్నారు. ఇంతకు ముందు తాను నటించిన హనుమాన్ చిత్రం చైనా, జపాన్ దేశాల్లో విడుదలయ్యిందని గుర్తుచేశారు. ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ చేయడం చాలా సవాల్‌గా మారిందన్నారు. చిత్రం అంతర్జాతీయ స్థాయి విలువలతో ఉండాలని వీఎఫ్‌ఎక్స్‌లో ప్రతిభావంతులైన ప్రసాద్, కార్తీక్ పని చేశారని చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్వాహకురాలు అర్చనకు తేజా సజ్జా ధన్యవాదాలు తెలిపారు.