
తమిళ హీరో సూర్య (Suriya)కి భద్రతా అధికారిగా పని చేస్తున్న జార్జ్ ప్రభు ఆర్థికంగా మోసపోయారు. సూర్య ఇంట్లో పనిచేసేవారి చేతుల్లో రూ.42 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్య ఇంట్లో సులోచన, ఆమె కుమారుడు పని చేస్తున్నారు. వీరు సెక్యూరిటీ ఆఫీసర్ జార్జ్‌కు అధిక వడ్డీ ఆశ చూపారు. దీంతో ఆయన మొదటగా రూ.1 లక్ష ఇచ్చారు. దానికి బదులుగా 30 గ్రాముల బంగారాన్ని వీళ్లు తిరిగిచ్చారు. జార్జ్‌కు నమ్మకం కుదరడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం రూ.42 లక్షలను నిందితులకు బదిలీ చేశారు.
రూ.2 కోట్ల మేర మోసం
అప్పటినుంచి వాళ్లు డబ్బులివ్వకుండా సైలెంట్ అయ్యారు. దీంతో భద్రతా అధికారి తన డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా సులోచన కుటుంబం అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఇదే కుటుంబం చెన్నైలో పలువురిని నమ్మించి రూ.2 కోట్ల దాకా మోసాలకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ నలుగురూ సూర్య ఇంట్లో పనిచేసేవారే కావడం గమనార్హం!
చదవండి: సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై..