దర్శకుడు మారాడా? | Sundar C to helm Mookuthi Amman 2 | Sakshi
Sakshi News home page

దర్శకుడు మారాడా?

Aug 12 2024 1:10 AM | Updated on Aug 12 2024 1:10 AM

Sundar C to helm Mookuthi Amman 2

‘ముకుత్తి అమ్మన్‌ (2020)’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’) సినిమా సీక్వెల్‌ ‘ముకుత్తి అమ్మన్‌ 2’కు తమిళ దర్శకుడు సుందర్‌. సి దర్శకత్వం వహించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. నయనతార, ఆర్‌జే బాలాజీ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ముకుత్తి అమ్మన్‌’. ఆర్‌జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ కలిసి దర్శకత్వం వహించిన ఈ ఫ్యాంటసీ కామెడీ సినిమా 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. 

ఈ సినిమాకు సీక్వెల్‌ రానుందని, ఈ చిత్రంలో త్రిష లీడ్‌ రోల్‌లో నటిస్తారని, ఆర్‌జే బాలాజీ కూడా ఓ లీడ్‌ రోల్‌లో నటించి, పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం సాగింది. కానీ తొలి భాగంలో నటించిన నయనతారయే మలి భాగంలోనూ లీడ్‌ రోల్‌ చేస్తారని, వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ గత నెలలో ప్రకటించింది. 

అయితే దర్శకుడిని మాత్రం ప్రకటించలేదు. దీంతో ‘ముకుత్తి అమ్మన్‌ 2’కు ఆర్‌జే బాలాజీయే దర్శకత్వం వహిస్తారా? లేదా అనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. అయితే తాజాగా నటుడు–దర్శకుడు సుందర్‌. సి ఈ సినిమాను తెరకెక్కించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు... ఈ ఏడాది చివర్లో చిత్రీకరణనుప్రారంభించి, వచ్చే ఏడాది ప్రథమార్ధంలోపు ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలని యూనిట్‌ ప్లాన్‌ చేస్తోందని భోగట్టా. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement